దేశం ఎంపీల తీరుపై వైకాపా ఫైర్‌!

Update: 2016-08-02 11:16 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా పోరాటం ఇప్పుడు ఏపీ రాజ‌కీయ పార్టీల్లో చర్చ‌నీయాంశం అవుతున్న సంగ‌తి తెలిసిందే.  ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ పై ఇన్నాళ్లూ మౌనంగా ఉంటూ వ‌చ్చిన అన్ని రాజకీయ పార్టీలూ ఒకేసారి గ‌ళం విప్పుతూ ఉండ‌టం విశేషం! ప్రైవేటు బిల్లును కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామ‌చంద్ర‌రావు తీసుకొచ్చారు. కాబ‌ట్టి, ఆంధ్రా ప్ర‌జ‌ల త‌ర‌ఫున మేమే పోరాటం చేస్తున్నామ‌ని వారు చెప్పుకుంటున్నారు. ఇక‌, అధికార పార్టీ తెలుగుదేశం కూడా ప్ర‌త్యేక‌హోదాపై కేంద్రంలోని భాజ‌పా అనుస‌రిస్తున్న తీరును త‌ప్పుబ‌డుతోంది. పోరాడి సాధిస్తాం అని దేశం నేత‌లు అంటున్నారు. ఇదిలా ఉంటే, ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపా కూడా ఇప్పుడు అదే అంశ‌మై పోరాటం చేస్తోంది! అయితే, ఒకే డిమాండ్ మీద ఏపీలోని అధికార - ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన స‌భ్యులు లోక్‌ స‌భ‌లో పోరాటం చేయ‌డం మ‌రో విశేషంగా చెప్పుకోవాలి. ఏపీకి స్పెష‌ల్ స్టేట‌స్ కోసం తాము చిత్త‌శుద్ధితో పోరాటం చేస్తుంటే తెలుగుదేశం నేత‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు వైకాపా ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి - మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి.

ప్ర‌త్యేక హోదాపై చ‌ర్చిస్తూ తాము స‌భ‌లో స్పీక‌ర్ పోడియం వ‌ద్ద‌కు దూసుకెళ్లి నిర‌స‌న తెలుపుతుంటే, ఇదే స‌మ‌యంలో తెలుగుదేశం స‌భ్యులు హ‌డావుడి ప్రారంభించార‌ని అన్నారు. వాయిదా తీర్మానాన్ని తాము ప్ర‌తిపాదిస్తే దాన్ని అడ్డుకునే దేశం స‌భ్యులు ప్ర‌వ‌ర్తించారని చెప్పారు. భాజ‌పాతో పొత్తు పెట్టుకుని అధికారం అనుభ‌విస్తూనే ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను తెలుగుదేశం నాయ‌కులు మోసం చేస్తున్నార‌న్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం తామూ పోరాటం చేస్తున్నాం అని ప్ర‌జ‌ల‌ను న‌మ్మించేలా నటిస్తున్నార‌నీ విమ‌ర్శించారు.

అధికారం అనుభ‌విస్తూనే భాజ‌పాకి వ్య‌తిరేకంగా స‌భ‌లో ప్ల‌కార్డులు ప‌ట్టుకున్న దేశం నేత‌ల్ని చూసి బీజేపీ ఎంపీలు న‌వ్వుకుంటున్నార‌ని అన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై అంత ప్రేమే ఉంటే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో దేశం నేత‌లు మాట్లాడొచ్చు క‌దా, ప్ర‌త్యేక హోదా ఇచ్చేలా ఒప్పించే ప్ర‌య‌త్నం చెయ్యొచ్చు క‌దా అని సూచించారు. ప్ర‌త్యేక హోదాపై మొద‌ట్నుంచీ చిత్త‌శుద్ధితో పోరాటం చేస్తున్న‌ది వైకాపా మాత్ర‌మే అని వైవీ సుబ్బారెడ్డి వివ‌రించారు. మొద‌టి నుంచీ ఉద్య‌మాలు చేస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తాము ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు. అయితే, చంద్ర‌బాబు నాయుడు ఇప్ప‌టికీ రెండు నాల్క‌ల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నీ, స‌భ‌లో ఒక‌లా బ‌య‌ట మ‌రోలా మాట్లాడుతూ తెలుగుదేశం స‌భ్యులు గంద‌ర‌గోళం సృష్టిస్తున్నార‌ని విమ‌ర్శించారు.
Tags:    

Similar News