మెలానియా ముద్దుతో ప్రాశ్చాత్య మీడియా మోటు సరసం

Update: 2019-08-27 08:53 GMT
వ్యాఖ్యలకైనా హద్దు ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ లేదన్నట్లుగా సోషల్ మీడియాలో చోటు చేసుకునే కొన్ని పరిణామాల్ని చూసినప్పుడు అర్థమవుతుంది. అదే సమయంలో.. ప్రాశ్చాత్య మీడియా సంస్థలు తమకున్న స్వేచ్ఛను కొన్నిసార్లు ఎంత మోటుగా.. మొరటుగా వ్యవహరిస్తాయన్నది చూస్తే.. విస్మయం కలగాల్సిందే. వికాసంలో తమకు మించినోళ్లు లేరనే ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశానికి చెందిన మీడియాలు సైతం కొన్ని సందర్భాల్లో వ్యవహరించే తీరు చిరాకు తెప్పించటమే కాదు.. ఇదెక్కడి దరిద్రపుగొట్టు స్వేచ్ఛ అన్న భావనకు గురయ్యేలా చేస్తుంటాయి.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ఫ్రాన్స్ లో జీ7 దేశాల సదస్సు జరగటం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటో షూట్ ఒకటి జరిగింది. ఈ సందర్భంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలు మర్యాదపూర్వకంగా ముద్దు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా క్లిక్ మనిపించిన  ఒక ఫోటో ఇప్పుడు కొత్త రచ్చకు కారణమైంది. బ్యాడ్ టేస్ట్ అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే.. జీ7 సదస్సుకు ఆయా దేశాల అధినేతలు.. వారి జీవిత భాగస్వాములతో హాజరయ్యారు. ట్రంప్ కూడా తన సతీమణి మెలానియాతో విచ్చేశారు. దేశాధినేతలంతా కలిసి ఫోటో దిగారు. అలా ఫోటో దిగే క్రమంలో తన పక్కనే ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడానో మర్యాదపూర్వకంగా ముద్దు పెట్టారు.

అంతే.. కొత్త రచ్చ మొదలైంది. అమెరికా ఫస్ట్ లేడీ.. కెనడా ప్రధానిని గౌరవపూర్వకంగా ముద్దు పెట్టుకునే సమయంలో.. ట్రంప్ ముందు తన కళ్లను కిందకు దించి ఉండటం.. కెనడా ప్రధానిని మెలానియా ఆరాధనగా చూస్తున్నట్లుగాఫోటో ఉంది. ఇంకేముంది.. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా  పిచ్చి ప్రేలాపనలతో చెలరేగిపోయారు. #మెలానియాలవ్స్‌ ట్రూడో అనే హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్ చేస్తూ.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు.

అలాంటి వాటిల్లో శాంపిల్ గా ఒకట్రెండు చెప్పాల్సి వస్తే.. ఎన్నో రోజులుగా మెలానియా చూపు ట్రూడోపై ఉందని.. చాలామంది అమ్మాయిల మాదిరే ఆమె కూడా కెనడా పారిపోవటానికి ప్రయత్నిస్తున్నారంటూ పేర్కొన్నారు. ప్రధాన మీడియానే మొరటు వ్యాఖ్యలు చేసినప్పుడు సోషల్ మీడియా చూస్తూ ఊరుకుంటుందా? మరింతగా చెలరేగిపోదు?  అదే రీతిలో చెలరేగిపోయింది.

ట్రంప్‌ నకు పెద్ద చిక్కే వచ్చిపడింది. మెలానియా రిస్క్‌ చేయడానికి వెనుకాడటం లేదనుకుంటా అంటూ విపరీర్థాలతో కామెంట్‌ చేస్తున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి గతంలో ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రూడో పక్కన కూర్చున్న ఫోటోను.. ప్రస్తుతం మెలానియా ఫోటోను పోలుస్తూ.. ఇవాంకా.. మెలానియా ట్రూడో వైపు ఎలా చూస్తున్నారో గమనించండి.. మీ జీవితంలో ఇలాంటి వ్యక్తి రావాలని కోరుకోడంటూ విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.
Tags:    

Similar News