కరిగిన ఆ మంచు.. అమెరికాలోని ఓ రాష్ట్రంలో అడుగుమేర

Update: 2022-07-22 23:30 GMT
మీరెప్పుడైనా ప్రపంచ పటాన్ని ప్రత్యేకంగా చూస్తే.. ఉత్తర అమెరికాకు దగ్గరగా, యూరప్ నకు కాస్త దూరంగా ఓ ఖండం కనిపిస్తుంటుంది. దీనికి సమీపానే ఐస్ ల్యాండ్ కూడా ఉంటుంది.
అయినప్పటికీ గ్రీన్ ల్యాండ్ ప్రత్యేకత వేరు. పూర్తి స్థాయి మంచు ఖండం ఇది. ఉత్తర ధ్రువానికి దగ్గరగా.. ఉండే అతి శీతల ప్రదేశం గ్రీన్ ల్యాండ్. వాస్తవానికి అక్కడి మంచు కొండలు
కరుగుతున్నాయి అంటే.. ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నదనే అర్థం.

జనాభా 56 వేలు.

ఆర్కిటిక్ అంటార్కిటిక్ సముద్రాల మధ్య ఉండే గ్రీన్ ల్యాండ్ జనాభా 56 వేలు. ప్రత్యేకమైన పాలనా వ్యవస్థ ఉంది. అయితే, అధికారికంగా మాత్రం డెన్మార్క్ లో  భాగం. ప్రపంచంలోనే అత్యంత
పెద్ద ద్వీపం గ్రీన్ ల్యాండ్. కింగ్ డమ్ ఆఫ్ డెన్మార్క్ కిందనే దీనిని పరిగణిస్తారు. కాగా, గ్రీన్ ల్యాండ్, డెన్మార్క్ రాజధానుల మధ్య దూరం 3,5,32 కిలోమీటర్లపైనే. భౌగోళికంగా దూరమైనా..
రాజకీయ, సంస్క్రతిపరంగా డెన్మార్క్ తోనే గ్రీన్ ల్యాండ్ అనుంబంధం ఉంది.

భూమిపై ఉష్ణోగ్రతలు పెరిగితే.. అక్కడ ముప్పే..

భూమి మీద ఉన్న మిగతా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే గ్రీన్ ల్యాండ్ కే మొదట ముప్పు. ఇటీవల యూరప్ లో అత్యంత వేడిని ప్రజలు ఎదుర్కొన్నారు. తొలిసారిగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత
దాటింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఇలాంటి పరిస్థితులు మన దేశంలోనూ వేసవి కాలంలో ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే భూమిపై కొన్ని
ప్రాంతాల్లో ఈ ఏడాది ఉష్ణతాపం గణనీయంగా పెరగడం హిమ ఖండాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. దీంతో గ్రీన్‌ల్యాండ్‌లో మంచు వేగంగా కరిగిపోతోంది. కొన్ని రోజులుగా ఇక్కడ
అనూహ్యంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సాధారణ స్థితితో పోలిస్తే దాదాపు 10 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫలితంగా  జులై 15-17 మధ్య ఇక్కడ మంచు కరిగి నిత్యం
600 కోట్ల టన్నుల నీరు ప్రవహించింది.

ఆ కరిగిన నీరు ఎంతో తెలుసా?

విశ్వ క్రీడలు ఒలింపిక్స్ గురించి మనందరికీ తెలిసిందే. ఇందులో ఈత పోటీలు కూడా జరుగుతుంటాయి. తాజాగా గ్రీన్ ల్యాండ్ లో కరిగిన మంచు దాదాపు 72 లక్షల ఒలింపిక్‌ సైజు ఈత
కొలనులను నింపేంత ఉంది. ఆ మంచు అమెరికాలోని పశ్చిమ వర్జీనియా రాష్ట్రం మొత్తం అడుగు ఎత్తున నీరు ముంచెత్తడానికి సరిపోతుంది. 40 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే ఇది ఏమాత్రం
సాధారణం కాదని అర్థమవుతుంది.

టీషర్ట్ తో బయటకు రావొచ్చు

గ్రీన్ ల్యాండ్ శీతల ప్రదేశం అని చెప్పుకొన్నాం కదా..? అక్కడ బయటకు రావాలంటే కనీసం నాలుగైదు పొరల వస్త్రాలు ధరించాలి. అయితే, ఇప్పుడు అతి భారీ ఉష్ణోగ్రతలతో గ్రీన్‌ల్యాండ్‌లో
సాధారణ టీషర్ట్‌ ధరించి ప్రజలు బయటకు వచ్చేంత వీలు కలిగింది.

ఇంకా కరిగితే నగరాలే మునుగుతాయి..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమ ఖండాల్లో మంచు కరిగితే ఏమవుతుందో తెలుసా..? అకస్మాత్తు వరదలు సంభవిస్తాయి. భూమి మీద నీటి మట్టాలు పెరుగుతాయి. వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్‌
హిమఖండాలు కరుగుతున్నాయని గత కొన్నేళ్లుగా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్కిటిక్‌లో ఉష్ణోగ్రత భూమిపై మరెక్కడా లేని విధంగా పెరుగుతోంది. 2019లో
ఇక్కడ రికార్డు స్థాయిలో ఒక ముంచుపొర మొత్తం కరిగిపోయింది. ఫలితంగా భూమిపై నీటి మట్టం 1.5 మిల్లీ మీటర్లు పెరిగింది. వాస్తవానికి గ్రీన్‌ల్యాండ్‌లో ఉన్న మంచు మొత్తం కరిగితే
ప్రపంచ వ్యాప్తంగా నీటిమట్టం 7.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. అంటే.. పెద్దపెద్ద తీర నగరాలే మునిగే ప్రమాదం ఉంటుంది.
Tags:    

Similar News