మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్‌ లో మెర్సీ కిల్లింగ్‌ కు ద‌ర‌ఖాస్తు!

Update: 2019-08-06 13:52 GMT
మెర్సీ కిల్లింగ్ ఇటీవ‌ల ఈ ప‌దం ఎక్కువుగా వినిపిస్తోంది. స‌హ‌జంగా రోడ్డు ప్ర‌మాదాలు - ఇత‌ర‌త్రా ప్ర‌మాదాల‌కు గుర‌య్యి కోమాలోకి వెళ్లిపోయిన వారి విష‌యంలో వారి కుటుంబ స‌భ్యులో లేదా త‌ల్లిదండ్రుల్లో స‌హ‌జంగా మెర్సీ కిల్లింగ్‌ కు అనుమ‌తి కోరుతుంటారు. అలా చేశాక వారి అవ‌య‌వాల‌ను ఇత‌రుల‌కు అమ‌ర్చ‌డం ద్వారా త‌మ మ‌నిషి చ‌నిపోయినా... మ‌రో ఐదారుగురు జీవితాల్లో వెలుగులు నింపాడ‌న్న సంతృప్తి వారికి కూడా ఉంటుంది. అయితే ఇటీవ‌ల కొంద‌రు అనేక కార‌ణాల‌తో మెర్సీ కిల్లింగ్‌ కు ద‌ర‌ఖాస్తు చేసుకుంటుండ‌డం షాకింగ్‌ గా మారింది.

ఈ మార్చి నెల‌లో అప్పులపాలైన ఓ రైతు మెర్సీ కిల్లింగ్‌ కు తనకు అనుమతించాలంటూ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ కు లేఖ రాయడం సంచలనమైంది. ఆగ్రాలో బంగాళాదుంప పండించే రైతు ప్రదీప్ శర్మ పంట సాగుకు భారీగా అప్పులు చేశాడు. పంట సాగులో భారీగా న‌ష్టాలు రావ‌డంతో అత‌డు మెర్సీ కిల్లింగ్‌ కు అనుమ‌తి కావాల‌ని ఏకంగా సీఎంకే లేఖ రాసి సంచ‌ల‌నం క్రియేట్ చేశాడు. తాజాగా తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్‌ న‌గ‌ర్ జిల్లాలో అనారోగ్యంతో మంచం ప‌ట్టిన ఓ వృద్ధురాలు మెర్సీ కిల్లింగ్‌ కు అనుమ‌తి కోరుతూ ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

సత్తెమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు ఇటీవ‌ల తీవ్ర జ్వ‌రానికి గురైంది. ఈ క్ర‌మంలోనే ఆమె స్థానిక నర్సింగ్‌ హోమ్‌ లో ఓ డాక్టర్‌ ను సంప్రదించింది. ఆమె చెప్పిన వివ‌రాల ప్ర‌కారం ఆ డాక్ట‌ర్ ఎలాంటి ర‌క్త ప‌రీక్ష‌లు చేయ‌కుండా మందులు రాసిచ్చాడ‌ట‌. అవి వాడ‌డంతో ఆమె కాళ్లు - చేతులు - న‌డుం ప‌డిపోయి మంచానికే ప‌రిమిత‌మైంది. ఈ క్ర‌మంలోనే స‌త్తెమ్మ ఆ డాక్ట‌ర్ చేసిన త‌ప్పుడు వైద్యంతోనే తాను మంచానికి ప‌రిమిత‌మైపోయాన‌ని.. ఆ డాక్ట‌ర్‌ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆమె కోరింది.

అలా కాని ప‌క్షంలో త‌న‌కు మెర్సీ కిల్లింగ్‌ కు అనుమతివ్వాలంటూ ఆమె దరఖాస్తు చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. ఇక త‌న స‌మ‌స్య‌పై ఇప్ప‌టికే జిల్లా క‌లెక్ట‌ర్‌ కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నాన‌ని.. క‌లెక్ట‌ర్ వేసిన క‌మిటీ నివేదిక ఇచ్చినా కూడా ఆ డాక్ట‌ర్‌ పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని కూడా ఆమె వాపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించక‌పోతే త‌న‌కు మెర్సీ కిల్లింగ్‌ కు అనుమతివ్వాలని ఆమె కోరుతోంది.
 
Tags:    

Similar News