కామినేని పరువు తీసేసిన వైసీపీ

Update: 2016-09-19 10:49 GMT
ఏపీ వైద్య - ఆరోగ్య శాఖ మంత్రి.. బీజేపీ నేత డాక్టర్ కామినేని శ్రీనివాస్ పై వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. స్వయంగా వైద్యుడైన కామినేని రాష్ట్రంలో ప్రజలు జ్వరాలతో మంచంపట్టినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని ఆరోపించడమే కాకుండా కామినేని వైద్య పట్టాపైనా అనుమానాలు వ్యక్తంచేశారు.  కనీసం బీపీ చూడడం కూడా రాని వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ కు ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో అర్థం కావడం లేదంటూ వైసీపీ కార్యాలయం సాక్షిగా మీడియా ముందు ఎండగట్టేశారు ఆ పార్టీ నేతలు.
    
హైదరాబాద్ లోని వైసీపీ కార్యాలయంలో ఈ రోజు ఆ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రమంతటా విజృంభిస్తున్న జ్వరాలపై పార్టీ తరఫున ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజలు జ్వరాలతో బాధపడుతుంటే - వైద్య ఆరోగ్య మంత్రిగా ఉన్న కామినేని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డెంగ్యూ  - చికున్ గున్యాల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవడం లేదని తప్పుపట్టారు. తక్షణం కామినేని తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
    
ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులపై పట్టు లేకపోవడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తిందని నాగార్జున మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ఆలోచనంతా కేసులు - కాంట్రాక్టుల్లో వాటాలు - కమిషన్లపై ఉందని.. మంత్రులు తమకొచ్చే కమిషన్లపై దృష్టిని పెట్టి ప్రజల బాధలను గాలికొదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. డాక్టర్ అయిన వైద్య మంత్రికి బీపీ కూడా చూడడం రాదనడంతో ఆయనకు పరువు పోయినట్లయింది.
Tags:    

Similar News