నెలావారీ పాసుల పై కీలక ప్రకటన చేసిన మెట్రో

Update: 2019-12-25 10:44 GMT
హైదరాబాదీయుల కు హాఫ్ స్వీట్ న్యూస్ గా చెప్పాలి. అదేంటండి.. ఫుల్ స్వీట్ న్యూస్.. హాఫ్ స్వీట్ న్యూస్ లాంటివి ఉంటాయా? అంటే అవునని చెప్పాలి. హైరాబాద్ మెట్రో రైల్ చేసిన తాజా ప్రకటనే దీనికి నిదర్శనంగా చెప్పాలి. హైదరాబాదీయులకు మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా నెలావారీ పాసుల మీద ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తొలుత రద్దీ పెద్దగా లేదని ఆపినవారు.. తర్వాతి కాలంలో రద్దీ పెరిగిన తర్వాత కూడా ఎలాంటి నిర్నయం తీసుకోలేదు.

తాజాగా నెలవారీ పాసుల విషయం పై కీలక ప్రకటన చేశారు. కొత్త సంవత్సరం లో నెలవారీ పాసుల్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. కాకుంటే.. ఇందుకు మెట్రో పెట్టిన మెలిక చూసినప్పుడు పాసుల ప్రకటన హాఫ్ స్వీట్ న్యూస్ గానే చెప్పాలి. ఎందుకంటే.. మెట్రో నెలవారీ పాసుల కొత్త ఏడాది జనవరి లో అందుబాటు లోకి వస్తున్నా.. వాటి ధర ఎంతన్న విషయాన్ని మాత్రం ప్రకటించ లేదు. అంతేకాదు.. ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ పరిధికి మాత్రమే పాసులు జారీ చేయనున్నారు.

ఉదాహరణకు మియాపూర్ నుంచి అమీర్ పేట కు.. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ వరకూ.. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వరకూ.. ఇలా ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ వరకు మాత్రమే ఈ నెలవారీ పాసులు చెల్లుతాయి. అయితే.. వీటి ధరలు ఎలా ఉంటాయన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే.. ఈ తరహా పాసుల విధానం కారణంగా నిర్ణీత దూరానికి మాత్రమే తప్పించి.. వేరే రూట్లలో ప్రయాణించాలంటే మాత్రం ఇవి పనికి రావు. తమ పాసులు ఉన్న స్టేషన్ల మధ్య తప్పించి మిగిలిన చోటుకు వెళ్లాలంటే టికెట్లు కొనుక్కొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధానం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News