రాష్ట్ర‌ప‌తిగా జ‌నం మెచ్చింది ఈయ‌న‌నేన‌ట‌!

Update: 2017-06-19 04:30 GMT
భార‌త రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ వ‌చ్చే నెల‌లోనే ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీ నేత‌గా - కాంగ్రెస్ అధికారంలో ఉండ‌గా కేంద్ర కేబినెట్‌ లో కీల‌క మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ప్ర‌ణ‌బ్ దాదా... రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి కూడా వ‌న్నె తెచ్చార‌నే చెప్పాలి. రాష్ట్ర‌ప‌తిగా దాదా త‌న ప‌ద‌వీ కాలంలో చిన్న మ‌చ్చ కూడా లేకుండా రాణించ‌గ‌లిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా, రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లో కాలు పెట్టిన దాదా... ఆ త‌ర్వాత బీజేపీ గ‌ద్దెనెక్కినా ఏమాత్రం తొట్రుపాటు లేకుండానే త‌న విధిని నిర్వ‌ర్తించారు. ఇక ప‌ద‌వీ కాలం ముగియ‌గానే దాదా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ ను ఖాళీ చేయ‌నున్నారు.

ఆ త‌ర్వాత కొత్త రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌ణ‌బ్ స్థానంలో రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లో అడుగుపెట్టే వారెవ‌ర‌న్న విష‌యంపై అధికార బీజేపీ ఇప్ప‌టికీ ఓ అంచ‌నాకు రాలేక‌పోయింది. అంతేకాకుండా తాము ప్ర‌తిపాదించే వ్య‌క్తికి మ‌ద్ద‌తిస్తామంటేనే అభ్య‌ర్థి పేరును వెల్ల‌డిస్తామ‌న్న రీతిలో విప‌క్షాల‌తో బేర‌సారాలు ఆడుతోంది. ఈ దిశ‌గా త‌న ప్ర‌తిపాద‌న‌కు విప‌క్షాల నుంచి  ఆన్స‌ర్ రాద‌ని తెలుసుకున్న బీజేపీ నేత‌లు రివ‌ర్స్ గేర్‌ లో వెళ్లి... మీ అభ్య‌ర్ధి ఎవ‌రైనా ఉంటే చెప్పండంటూ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపారు. అయితే బీజేపీ స‌ర్కారుకు షాకిస్తూ... ముందుగా మీ అభ్య‌ర్థి పేరు చెబితేనే మా అభిప్రాయం చెబుతామంటూ అటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇటు వామ‌ప‌క్షాల నేత‌లు కూడా వారికి ముఖం మీదే త‌లుపులేశారు.

రాజ‌కీయ పార్టీల మ‌ధ్య రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎవ‌ర‌న్న విష‌యంపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గానే... ఇండియా టుడే ఓ స‌ర్వే నిర్వ‌హించింది. భార‌తావ‌నికి కొత్త ప్ర‌థ‌మ పౌరుడిగా ఎవ‌రు ఉంటే బాగుంటుంద‌న్న విష‌యంపై జ‌నం నాడిని తెలుసుకునేందుకు ఆ సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో జ‌నం త‌మ మ‌దిలో ఉన్న వ్య‌క్తుల‌ను ప‌రిశీలించి మ‌రీ చాలా స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పార‌ట‌. అయినా ఈ స‌ర్వేలో మెజారిటీ జ‌నం ఎవ‌రికి ఓటేశారంటే... ఏ రాజ‌కీయ వేత్త‌తో అనుకుంటే మీరు త‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే స‌ర్వేలో పాల్గొన్న వారిలో దాదాపుగా 40 శాతానికి పైగా జ‌నం మెట్రో మ్యాన్‌ గా ముద్ర ప‌డ్డ ప్ర‌ముఖ ఇంజినీరింగ్ నిపుణుడు శ్రీధ‌ర‌న్ రాష్ట్ర‌ప‌తిగా ఎంపికైతే బాగుంటుంద‌ని చెప్పార‌ట‌. దాదాపు స‌గం మంది మెట్రో శ్రీధ‌ర‌న్ వైపు మొగ్గు చూప‌గా, రాజ‌కీయ వేత్త‌లుగా ఉంటూ ఈ రేసులోకి వ‌స్తార‌ని ప్ర‌చారం సాగిన వారికి శ్రీ‌ధ‌ర‌న్‌ కు ద‌క్కిన ఓట్ల‌లో స‌గం మేర కూడా ద‌క్క‌క పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ స‌ర్వేలో శ్రీధ‌ర‌న్ త‌ర్వాత స్థానాల్లో ఉన్న వ్య‌క్తుల విష‌యానికి వ‌స్తే... మోదీ కేబినెట్‌ లో విదేశాంగ శాఖ మంత్రి హోదాలో చాలా చురుకైన మంత్రిగా మ‌న్న‌న‌లు అందుకుంటున్న సుష్వా స్వ‌రాజ్ రెండో స్థానంలో ఉన్నారు. ఈమెకు 15 శాతం మేర ఓట్లు పోల‌య్యాయి. ఇక బీజేపీ కురువృద్ధుడు - కేంద్ర మాజీ మంత్రి లాల్ కృష్ణ అద్వానీకి కేవ‌లం 13 శాతం మంది మాత్ర‌మే ఓటేశారు. రాష్ట్ర‌ప‌తి రేసులో ప్ర‌ముఖంగా వినిపించిన ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తికి 11 శాతం ఓట్లు రాగా, ఆరెస్సెస్ చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్‌కు కేవలం 5 శాతం ఓట్లు ప‌డ్డాయి. బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్‌ కు కూడా కేవ‌లం 5 శాతం మంది మాత్ర‌మే ఓటేశార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News