రెండేళ్లలో అమరావతిలో మెట్రో పరుగులు

Update: 2016-05-14 04:55 GMT
హైదరాబాదీయుల కలల పంట అయిన మెట్రో రైలు పట్టాల మీదకు ఎక్కేందుకు వాయిదాల మీద వాయిదాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్న ప్రకారం ఈ జూన్ కి మెట్రో పరుగులు తీయాల్సి ఉంది. అయితే.. రెండు మార్గాల్లోనే నిర్మాణం పూర్తి కావటం.. వీటి మధ్య దూరం తక్కువగా ఉండటంతో మరికొన్ని మార్గాల్లో పనులు పూర్తి అయ్యాక ఒకేసారి మెట్రోను స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని అమరావతిలోనూ మెట్రో పరుగులు తీయాలన్న ఆలోచనే కాదు.. ఆ పనులు ఎప్పటికి పూర్తి చేయాలన్న అంశంపై తాజాగా స్పష్టత వచ్చేసింది.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్ టెర్మినల్ నుంచి రాజధాని నగరమైన అమరావతిలోని నిడమానూరు మధ్య వరకూ మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం 13.27 కిలోమీటర్లుగా అంచనా వేస్తున్నారు. కారిడార్ 2గా వ్యవహరిస్తున్న ఈ మార్గంలో మెట్రో పనులు వేగంగా పూర్తి చేయటమే కాదు.. 2018 డిసెంబరు నాటికి పట్టాల మీదకు ఎక్కేలా చూడాలన్న నిర్ణయానికి రావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓపక్క హైదరాబాద్ లో ఏళ్ల తరబడి మెట్రో పనులు సా..గుతున్న సమయంలో.. అందుకు భిన్నంగా అమరావతిలో పరిస్థితులు వేగంగా మార్పులు చోటు చేసుకోవటం గమనార్హం.

అమరావతిలోని మెట్రో ప్రాజెక్టును ఢిల్లీ మెట్రో సంస్థకు అప్పగించనున్నారు. ఈ మేరకు అమరావతి మెట్రో రైలు సంస్థ.. డిళ్లీ మెట్రో రైలు సంస్థల మధ్య అధికారికంగా ఒప్పందం చేసుకోనున్నట్లుగా తేలుస్తోంది. అయితే.. అమరావతి మెట్రోకు.. ఢిల్లీ మెట్రో సంస్థకు మధ్యన కొన్ని సాంకేతిక అంశాల మధ్య తేడాలున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి ఈ అంశం మీద ప్రత్యేక శ్రద్ధతో వ్యవహరిస్తే.. రికార్డు సమయంలో అమరావతిలో మెట్రో పరుగులు తీయటం ఖాయమని చెప్పొచ్చు. అదే  జరిగితే.. 2019 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఏపీ రాజధాని అమరావతిలో మెట్రో పరుగులు తీసే దృశ్యం ఆవిష్కృతం కావటం ఖాయం.
Tags:    

Similar News