మెట్రోకు బెజవాడ పనికిరాదన్నారు

Update: 2015-08-26 04:34 GMT
కేంద్రం నుంచి వచ్చిన నిధులు.. పథకాల గురించి గొప్పలు చెప్పుకుంటూ.. అదంతా తమ గొప్పతనంగా చెప్పుకునే ఏపీ అధికారపక్షం అందుకు భిన్నంగా ఏదైనా జరిగితే మాత్రం మాట వరసకు కూడా వివరాలు వెల్లడించకుండా ఉండే వైనం తాజాగా బయటకు వచ్చింది.

అంతేకాదు.. కేంద్ర నిర్ణయాల్ని బయటకు పొక్కకుండా ఉండటమే కాదు.. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్న మాట వినిపిస్తోంది. దీనికి మంగళవారం నాటి చంద్రబాబు మాటలు నిదర్శనంగా చెప్పొచ్చు. ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీని కలిసి వచ్చిన అనంతరం.. విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు.. ప్రధాని మోడీ ఎదుట తాను వినిపించిన సమస్యల చిట్టాను మీడియా ముందు ఎకరువు పెట్టారు. ఈ జాబితాలో ఏపీ రాజధానికి సమీపాన ఉండే విజయవాడకు మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి ప్రస్తావించామని.. సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. అయితే.. విజయవాడ మెట్రోకు సంబంధించిన వాస్తవం మరోలా ఉంది. మైట్రో రైల్ ఏర్పాటుకు బెజవాడ ఏమాత్రం బెస్ట్ కాదని కేంద్రం అభిప్రాయపడింది. మెట్రో రైల్ ను ఏర్పాటు చేయాలంటే కనీసం 20 లక్షల మంది జనాభా ఉండాలని పేర్కొంది.

ఈ నిజాన్ని నెల రోజుల క్రితమే ఏపీ సర్కారుకు లేఖ ద్వారా కేంద్రం తెలిపినట్లు చెబుతున్నారు. అయితే.. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఏపీ సర్కారు ఇంతవరకూ అధికారికంగా బయటపెట్టింది లేదన్న
​విషయం తెలుస్తోంది.

2019.. 20 నాటికి కూడా విజయవాడలో పది లక్షల మంది ప్రయాణించే అంశం అనుమానమేనని.. అందుకే విజయవాడకు మెట్రో రైల్ సాధ్యం కాదన్నట్లుగా పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే.. ప్రత్యేక హోదా.. ప్యాకేజీ..పోలవరం లాంటి హామీల మీదన సందేహాలు వ్యక్తమవుతుంటే.. తాజాగా ఆ జాబితాలోకి మెట్రో రైల్ కూడా వచ్చి చేరిందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News