మెట్రో రైల్ కార్డు లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చింది

Update: 2017-10-31 06:14 GMT
ఏళ్ల‌కు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. మ‌హా అయితే మ‌రో నాలుగు వారాలంతే. హైద‌రాబాదీయుల ట్రాఫిక్ కష్టాల‌కు చెక్ చెబుతూ.. రోడ్డు ప్ర‌యాణ న‌ర‌కాన్ని త‌గ్గించే హైద‌రాబాద్ మెట్రో రైల్ న‌వంబ‌రు 28 నుంచి ప‌ట్టాలు ఎక్క‌నున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌ధాని మోడీ ప్రారంభించే మెట్రో రైల్‌కు సంబంధించి కీల‌కాంశాలు ఇప్ప‌టివ‌ర‌కూ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. అప్పుడెప్పుడో మెట్రో ఛార్జి గురించి ఒక మాట చెప్పారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌ళ్లీ వివ‌రాలు ప్ర‌క‌టించింది లేదు. గ‌తంలో ప్ర‌క‌టించిన దాని ప్ర‌కారం మెట్రో రైల్ మినిమం చార్జ్ రూ.10 ఉంటుంద‌ని చెప్పారు. పెరిగిన ధ‌ర‌లు.. మారిన కాలానికి త‌గ్గ‌ట్లుగా మినిమం ఛార్జ్ రూ.15 వ‌ర‌కు ఉంటుందంటున్నారు.

ఇదిలా ఉంటే.. మెట్రో రైలు కార్డుకు సంబంధించిన ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. కార్డు కోసం మినిమం ఎంత‌న్న విష‌యంపై ఇప్ప‌టివర‌కూ స్ప‌ష్ట‌త లేదు. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం హైద‌రాబాద్ మెట్రోరైల్ కార్డు మినిమం రూ.200 ఇష్యూ చేస్తార‌ని చెబుతున్నారు. మొద‌ట ఈ కార్డును కొనుగోలు చేసిన‌ప్పుడు రూ.200 ఇవ్వాల్సి ఉంటుంద‌ని.. రూ.100 మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌తి మెట్రో రైల్ స్టేష‌న్లోనూ ఈ స్మార్ట్ కార్డును అమ్ముతారు. మినిమం రూ.200ల‌కు ల‌భించే ఈ కార్డును రూ.2000 వ‌ర‌కూ రీఛార్జ్ చేసుకోవ‌చ్చు.

మెట్రో రైల్ లో ప్ర‌యాణించే ప్ర‌తిసారీ.. రైలు ఎక్క‌టానికి మూడో అంత‌స్తులోకి వెళ్లేట‌ప్పుడు స్వైప్ చేయ‌టం ద్వారా స్మార్ట్ కార్డులో ఉన్న మొత్తం క‌ట్ అవుతూ ఉంటుంది.

తొలుత ఈ స్మార్ట్ కార్డు కేవ‌లం మెట్రో రైల్ ఛార్జీ మాత్ర‌మే క‌ట్ అయ్యేలా ఉంటుంది. త‌ర్వాతి కాలంలో పార్కింగ్‌.. బ‌స్సులు.. క్యాబ్ లోనూ వినియోగించుకునే వీలు ఉండ‌నుంది. ఈ స్మార్ట్ కార్డు కొనుగోలు కోసం వెబ్ సైట్ ద్వారా అమ్మాల‌న్న ఆలోచ‌న‌లో మెట్రో రైల్ నిర్వాహ‌కులు భావిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే మెట్రో రైలు ఎక్కే ముందు కార్డును స్వైప్ చేయ‌టం.. త‌ర్వాతి స్టేష‌న్లో దిగిన త‌ర్వాత‌.. బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు కార్డును స్వైప్ చేస్తే.. అత‌గాడు ప్ర‌యాణించే దూరాన్ని లెక్కేసి.. ఛార్జి మొత్తాన్ని కార్డు నుంచి క‌ట్ చేస్తారు. అయితే.. ఈ కార్డు అమ్మ‌కాలు ఎప్ప‌టి నుంచి అన్న విష‌యాన్ని హైద‌రాబాద్ మెట్రో రైల్ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం మ‌రో రెండు వారాల్లో ఈ అమ్మ‌కాలు షురూ కావ‌చ్చ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News