అది శ‌ర‌ణార్థుల పాలిట `మృత్యు` స‌ముద్రం!

Update: 2017-11-25 13:29 GMT
బెర్ముడా ట్ర‌యాంగిల్‌.....ఆ ప్రాంతంలో మునిగిపోయిన‌ ఓడ‌లు, విమానాల జాడ ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌లేదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ స‌ముద్ర ప్రాంతం ఒక మిస్ట‌రీగా మిగిలింది. అదే త‌ర‌హాలో మ‌ధ్య ధ‌రా స‌ముద్రం కూడా చాలామంది ప్రాణాలను పొట్ట‌న పెట్టుకుంది. అయితే, బెర్ముడా ట్ర‌యాంగిల్ లాగా అక్క‌డ మిస్ట‌రీ ఏమీ లేదు. ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకొని మ‌ధ్య‌ధ‌రా స‌ముద్రాన్ని ప్ర‌మాద‌క‌ర రీతిలో దాటుతున్న శ‌ర‌ణార్థులు ఆ స‌ముద్ర‌గ‌ర్భంలో క‌లిసిపోవ‌డ‌మే అందుకు కారణం. ఒక ప్రాంతంలో ఉగ్ర‌వాదం....మ‌రొక ప్రాంతంలో సంక్షోభం....వేరొక ప్రాంతంలో అంత‌ర్యుద్ధం....కార‌ణాలు ఏవైనా అంతిమంగా బాధితులు ప్ర‌జ‌లే. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల త‌మ స్వ‌దేశాన్ని విడిచి శ‌ర‌ణార్థుల‌లాగా వ‌ల‌స పోతున్న అమాయ‌క ప్ర‌జ‌లే బ‌లిప‌శువులు. అందుకే మధ్యదరా సముద్రాన్ని అత్యంత ప్రాణాంతక సరిహద్దుగా గుర్తించినట్టు ఐక్య‌రాజ్య‌స‌మితి శ‌ర‌ణార్థుల ఏజెన్సీ పేర్కొంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న అంతర్యుద్ధాలు, సంక్షోభాల కారణంగా టర్కీ - లిబియా - సిరియా వంటి దేశాల నుంచి మద్యధరా సముద్రం మీదుగా యూరోపియన్ దేశాలకు ల‌క్ష‌లాది మంది శరణార్థులు వలస వెళ్తున్న సంగతి తెలిసిందే.

అయితే, అత్యంత ప్ర‌మాద‌క‌ర రీతిలో, అతి స్వ‌ల్ప జాగ్ర‌త్త‌ల‌తో మ‌ర బోట్ల‌పై సాగే ప్ర‌యాణంలో అర్థాంతరంగా త‌నువు చాలించే వారి సంఖ్య నానాటికీ  పెరుగుతూనే ఉంది. ఆ విధంగా 2000 నుంచి 2016 మధ్య కాలంలో మధ్యదరా సముద్రంలో మరణించినవారి గ‌ణాంకాల‌ను ఐరాస ఓ నివేదిక‌లో వెల్ల‌డించింది. ఆ స‌మ‌యంలో దాదాపు 33000మంది ప్రజలు మద్యధరా సముద్రంలో జల సమాధి అయ్యారని ఐరాస తెలిపింది. అందుకే, మధ్యదరా సముద్రాన్ని అత్యంత ప్రాణాంతక సరిహద్దుగా గుర్తించింది. కేవలం 2017లోనే యూరోపియన్ యూనియన్ కు దాదాపు లక్షా 61వేల మంది శరణార్థులు వలస వెళ్లినట్టు ఐవోఎం తెలిపింది. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.అయితే, శరణార్ధులను ఆదుకునే విషయంలో 2014-16 మ‌ధ్య కాలంలో యూరోపియన్ యూనియన్-టర్కీ మధ్య జరిగిన ఒప్పందంతో ఆ మరణాల రేటు తగ్గింద‌ని ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ (ఐఓఎమ్‌) అభిప్రాయపడింది. కానీ, మధ్యదరా సముద్రంలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 33వేలకంటే ఎక్కువ ఉండ‌వ‌చ్చని యూరోపియన్‌ యూనివర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్‌ అన్నారు.
Tags:    

Similar News