భయపెట్టిన 'వలస' సమూహం..కరోనా భయం..బతుకుభయం!

Update: 2020-04-15 08:30 GMT
ఆకలితో అలమటించి చావడం కంటే సొంతూళ్లలోనే కలోగంజో తాగి చావడం మేలని ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు వలస కూలీలు పోటెత్తారు. లాక్ డౌన్ తో పొడిగింపుతో రైళ్ల రాకపోకలకు అనుమతి ఉందంటూ ప్రచారం సాగడంతో ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్ కు పెద్ద ఎత్తున వలస కార్మికులు పోటెత్తారు. సొంతూళ్లకు వెళ్లేందుకు అనుమతివ్వాలని ఆందోళన చేశారు.

ముంబైకి దేశవ్యాప్తంగా వలస కార్మికులు వచ్చి పనిచేసుకుంటారు. లాక్ డౌన్ తో గత 21 రోజులుగా వారంతా చిక్కుకొనిపోయారు. తిండికి - వసతి లేక అష్టకష్టాలు పడుతున్నారు. తాజాగా లాక్ డౌన్ ముగియడంతో సొంతూళ్ల వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు పోటెత్తారు. దీంతో సామాజిక దూరం - లాక్ డౌన్ నిబంధనలు గాలిలో కలిసిపోయాయి. దాదాపు 3వేల మందికి పైగా వలస కూలీలు పోటెత్తడంతో కరోనా వైరస్ విస్తృతి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. వీరందరూ రోడ్డెక్కడంతో పోలీసులు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి దాపురించింది.

చివరకు పోలీసులు లాఠీచార్జీ చేసి వలస కార్మికులను చెదరగొట్టారు. నాయకులు జోక్యం చేసుకొని వారికి వసతి - భోజనం కల్పిస్తామని చెప్పడంతో వలస కార్మికులు శాంతించారు.

వేలమంది గూమిగూడిన ఘటన ఇప్పుడు భీతావాహంగా మారింది. అందులో ఒక్కరికి కరోనా ఉన్న పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం - పోలీసులు ఇలా గుమిగూడకుండా చూడడంలో ఘోరంగా విఫలమయ్యారు.

ఈ దారుణ ఘటన ముంబైలో జరగగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కు ఫోన్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ వలస కార్మికులందరికీ వసతి - ఆహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడడంతో కరోనా వైరస్ పై యుద్ధాన్ని బలహీన పరిచారని మహారాష్ట్ర నేతలను అమిత్ షా గట్టిగా నిలదీసినట్టు తెలిసింది.

మరోవైపు ఈ దుస్థితికి అసలు కారణంగా కేంద్ర ప్రభుత్వమేనని రాష్ట్ర మంత్రి - శివసేన యువ నేత ఆదిత్య థాక్రే ఆరోపించాడు. వలస కార్మికులను ఇంటికి తిరిగి వెళ్లడానికి కేంద్రం అనుమతించకపోవడంతోనే ఈ ఘటన ముంబైలో జరిగిందని అన్నారు. వలస కార్మికుల విషయంలో కేంద్రం మనసు మార్చుకొని వారిని సొంతూళ్లకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు.  వారికి ఆహారం - ఆశ్రయం వద్దని..సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్నారని ఆదిత్యఠాక్రే ట్వీట్ లో పేర్కొన్నారు.


Tags:    

Similar News