ఆ యూట్యూబ్ చానల్ కు కోటి మంది.. రాహుల్ ఎఫెక్టు ఇంతనా?

Update: 2021-07-06 06:30 GMT
ఒకటి కాదు రెండు కాదు ఆ మాటకు వస్తే లక్ష కూడా కాదు.. ఏకంగా కోటి మంది సబ్ స్కైబర్లు.. అది కూడా ఒక యూట్యూబ్ చానల్ కు. ఇక్కడితో ఈ యూట్యూబ్ చానల్ ప్రత్యేకతలు ఆగిపోలేదు. ఇదో ప్రాంతీయ చానల్. అది కూడా గ్రామీణులు నిర్వహించే చానల్. అలాంటి యూట్యూబ్ చానల్ కు ఆదరణ కోటిమార్కు దాటటం ఇప్పుడు వారి గురించి అందరూ మరోసారి మాట్లాడుకునేలా చేసింది. అలా అని ఈ యూట్యూబ్ చానల్ లో పెద్ద పెద్ద స్టార్లు ఉండరు. సెలబ్రిటీలు ఉంటారు. జాతీయ.. అంతర్జాతీయ అంశాలేమీ ఇందులో చూపించరు.

జస్ట్ వారి ఊరు.. వారి చుట్టుపక్కల ఊళ్లల్లో చేసే విలేజ్ వంటకాల్నివారు వండి చూపిస్తుంటారు. దీనికి పిచ్చి ఆదరణ లభించటమేకాదు.. అరుదైన కోటి మార్కును దాటేసింది. అయితే.. ఈ యూట్యూబ్ చానల్ ఈ ఘనతను సాధించటానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కారణంగా చెప్పక తప్పదు. ఈ ఏడాది మొదట్లో తమిళనాడు అసెంబ్లీకి జరగాల్సిన ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూట్యూబ్ చానల్ చేసిన కార్యక్రమంతో.. దేశ వ్యాప్తంగా అందరి చూపు దీని మీద పడటమేకాదు.. అందరూ మాట్లాడుకునేలా చేసింది. కట్ చేస్తే.. తాజాగా కోటి మంది సబ్ స్కైబర్లు అందులో సభ్యులుగా చేరటంతో వారి విజయ గాధ మరోసారి తెర మీదకు వచ్చింది.

మూడేళ్ల క్రితం విలేజ్ కుకింగ్ మీద ఈ చానల్ ను షురూ చేశారు. తమిళనాడులోని వీర మంగళం గ్రామానికి చెందిన సుబ్రమణియన్.. ముథుమానికన్ అనే ఇద్దరు అన్నదమ్ములు కలిసి అయ్యనార్ అనే వ్యక్తితో కలిసి ఈ  యూట్యూబ్ చానల్ ను స్టార్ట్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రుచికరమైన వంటల్ని ఎలా చేయాలో చేసి చూపించటం ఈ చానల్ ప్రత్యేకత. తక్కువ వ్యవధిలోనే ఆదరాభిమానాల్ని పొందిన ఈ చానల్ కు రాహుల్ గాంధీ పుణ్యమా అని బోలెడంత ప్రచారం లభించింది. ఆ తర్వాత నుంచి ఈ చానల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు.

కోటి సబ్ స్కైబర్లను దాటేసిన నేపథ్యంలో యూట్యూబ్ వీరి చానల్ కు డైమండ్ బటన్ ఇచ్చింది. వీరు పోస్టు చేసిన ఒక వీడియోను అత్యధికంగా 7.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఈ చానల్ కు నెలకు కనిష్ఠంగా రూ.22 లక్షల నుంచి రూ.3 కోట్ల మేర ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నట్లు చెబుతారు. తోపు కంపెనీలకు చెందిన యూట్యూబ్ చానళ్లకుసైతం కోటి మార్కు దాటాలంటే చెమటలు పట్టాల్సిందే. అలాంటిది గ్రామీణ వాతావరణంలో రూపొందించే వంటల వీడియోలకు ఇంత ఆదరణ? అన్నది ఇప్పుడు ఆసక్తికకరంగా మారింది.

తమకొచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని ఎంజాయ్ చేస్తూ ఊరుకోదు ఈ చానల్. తమ వంతు సామాజిక బాధ్యతను ప్రదర్శిస్తూ ఎప్పటికప్పుడు ప్రజల మనసుల్ని మరింత దోచుకోవటం వీరికి అలవాటు. ఇటీవల కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని డిసైడ్ అయితే వారు.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నుకలిసి రూ.10లక్షల విరాళాన్నిఇవ్వటం గమనార్హం. రోటీన్ కు భిన్నంగా ఉండే వీరి వీడియోలకు మరింత ప్రజాదరణ లభించాలని కోరుకుందాం.
Tags:    

Similar News