ఎంఐఎం స‌త్తా: డిప్యూటీ సీఎం కొడుకుపై దాడి

Update: 2016-02-02 15:48 GMT
హైద‌రాబాద్‌ లో ఎంఐఎం స‌త్తా ఏంటో చాటిచెప్పే దిశ‌గా, త‌మ మ‌న‌స్త‌త్వం ఏ విధంగా ఉంటుందో చాటిచెప్పేలా ఆ పార్టీ ప్ర‌వ‌ర్తించింది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ కుమారుడు అజం ఆలీపై ఎంఐఎం ఎమ్మెల్యే బలాల దాడికి పాల్ప‌డ్డారు. పాతబస్తీలోని అజంపురలో ఉన్న తెలంగాణ‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ నివాసంపై ఎమ్మెల్యే బ‌లాల స‌హా ఎంఐఎం కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో మహమూద్ ఆలీ కుమారుడు అజం ఆలీ గాయపడ్డారు.

 సమాచారం తెలుసుకున్న హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి అజంపురలోని మహమూద్ ఆలీ నివాసానికి బయలుదేరారు. పాతబస్తీలో పరిస్థితులను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దాడికి పాల్ప‌డిన వారిని వ‌దిలేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు మహమూద్ ఆలీ కుమారుడు అజం ఆలీపై దాడి చేసిన ఎమ్మెల్యే బలాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంద‌ర్భంగా అజం ఆలీ మీడియాతో మాట్లాడారు. ఓటమి భయంతోనే ఎంఐఎం దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎంఐఎం భయపెడితే తాము భయపడబోమని తేల్చి చెప్పారు. ఎంఐఎం దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. మ‌రోవైపు ఎంఐఎం నేత‌లు ఈ దాడిని స‌మ‌ర్థించుకున్నారు. రిగ్గింగ్‌ కు పాల్ప‌డిన తీరును నిర‌సిస్తూ తాము డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్లిన‌ట్లు వివ‌రించారు.
Tags:    

Similar News