ఎంఐఎం.. ల‌క్ష్యం ఏంటి? యూపీలో వ్యూహం అదిరేనా?

Update: 2022-01-09 03:30 GMT
తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌కు చెందిన ఎంపీ అస‌దుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ వ్యూహాల‌పై అతి పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ ఎత్తున చ‌ర్చ సాగుతోంది. ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా పార్టీ పై చ‌ర్చ సాగుతోంది. ముస్లిం ఓటు బ్యాంకు ను భారీ ఎత్తున ప్ర‌భావితం చేయ‌గ‌ల పార్టీగా.. ఎంఐఎం.. దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. అంతేకాదు.. సుమారు 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ పోటీ చేస్తుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో చిన్న చిత‌క పార్టీల‌తోనూ .. ఎంఐఎం పొత్తు పెట్టుకుంటుంద‌ని అంటున్నారు. అయితే.. ఈ విష‌యంలో ఇంకా క్లారిటీ రాక‌పోయినా.. కీల‌క‌మైన కాంగ్రెస్ , స‌మాజ్ వాదీ పార్టీ నేత‌లు ఎంఐఎంను.. ఇప్ప‌టికీ బీజేపీకి బీ పార్టీగానే చూస్తున్నారు.

దీనివ‌ల్ల‌.. స‌హ‌జంగానే ఎంఐఎంతో పొత్తుకు ఈ పార్టీలు దూరంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. అస‌దుద్దీన్ మాత్రం.. త‌న దూకుడు త‌గ్గే ప్ర‌స‌క్తి లేద‌ని.. క‌లిసి వ‌చ్చే పార్టీల‌తోనే ముందుకు సాగుతాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అనుకున్న విధంగా ముస్లిం పార్టీల‌తోపాటు.. కొన్ని చిన్న‌పార్టీల‌ను క‌లుపుకొని ముందుకు సాగుతున్నారు. ప్ర‌స్తుతం ముస్లిం ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గాలైన 100 స్థానాల‌ను ఎంచుకున్నారు. వీటిలో బిహార్ త‌ర‌హా ఫ‌లితం వ‌స్తుంద‌ని అస‌దుద్దీన్ అంచ‌నాలు వేసుకుంటున్నారు. మొత్తం 403 స్థానాలున్న యూపీ ఎన్నిక‌ల్లో అస‌దుద్దీన్ వ్యూహం ఫ‌లించి 80 చోట్ల విజ‌యం ద‌క్కించుకున్నా.. ఇత‌ర పార్టీల‌కు ఆయ‌న తురుపు ముక్క‌గా మార‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి.

ఇదిలావుంటే.. కాంగ్రెస్ ఇక్క‌డ ప‌నితీరు.. పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి.పైగా .. 2017లో కాంగ్రెస్‌తో క‌లిసి త‌ప్పు చేశామ‌ని.. చెబుతున్న అఖిలేష్ యాద‌వ్‌.. ఇప్పుడు ఏపా ర్టీతోనూ పొత్తు కు సిద్ధంగా లేరు. ఇక‌, మాయావ‌తి నేతృత్వం లోని బీఎస్పీ ప‌నితీరు కూడా ప‌లుచ‌న‌గానే ఉంది. ఈ నేప‌థ్యంలోనే ఎంఐఎం.. ముస్లిం వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకునే ప్ర‌యత్నా ల‌ను ముమ్మ‌రం చేసింది. ఇప్ప‌టికే బ‌హిరంగ స‌భ‌లో వేడెక్కించిన అస‌దుద్దీన్‌.. ఇప్పుడు షెడ్యూల్ కూడా విడుద‌లైన నేప‌థ్యంలో మ‌రింత దూకుడుగా ముందుకు సాగుతార‌ని తెలుస్తోంది. అయితే.. ఎవ‌రి ఓట్లు చీల్చుతారు? అనేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. బీజేపీ వ్య‌తిరేక ఓట్లు వాస్త‌వానికి ఎస్పీకి ద‌క్కుతాయ‌ని అంచ‌నాలు ఉన్న నేప‌థ్యంలో ఎంఐఎంకి ఈ ఓటు ప‌డితే.. మ‌ళ్లీ బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే లెక్క‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News