వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌కే వ‌లంటీర్ పోస్టులిచ్చామంటున్న మంత్రి!

Update: 2022-06-28 07:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌లంటీర్ల ప‌నితీరుపై కొన్నిచోట్ల ప్ర‌శంస‌లు, మ‌రికొన్ని చోట్ల విమ‌ర్శ‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌లంటీర్ల‌పై ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వ‌నిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్సార్సీపీ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే వ‌లంటీర్ పోస్టులిచ్చామ‌ని ఆమె చెబుతున్నారు. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లా గొల్ల‌ప్రోలులో నిడ‌ద‌వోలు నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్సీపీ ప్లీన‌రీని నిర్వ‌హించారు. ఇందులో ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడితో క‌ల‌సి పాల్గొన్న వ‌నిత హాట్ కామెంట్స్ చేశారు.

ఏ పార్టీకి అయినా కార్య‌క‌ర్త‌లే ముఖ్య‌మ‌ని.. అలాగే వైఎస్సార్సీపీకి కూడా కార్య‌క‌ర్త‌లే ప్ర‌ధాన‌మ‌న్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తున్నామ‌ని త‌ప్పుడు వార్త‌లు వ‌స్తున్నాయ‌ని వ‌నిత మండిప‌డుతున్నారు. వ‌లంటీర్ పోస్టుల‌న్నీ వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌కే ఇచ్చామ‌ని చెబుతున్నారు.

త‌ద్వారా వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌కు గుర్తింపు ఇచ్చామ‌ని పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ఏ పోస్టులు ఇవ్వ‌డం లేద‌ని కొంత‌మంది విష ప్ర‌చారం చేస్తున్నార‌ని తానేటి వ‌నిత మండిప‌డుతున్నారు. నామినేటెడ్ పోస్టుల‌తో పాటు వ‌లంటీర్ పోస్టులు కూడా కార్య‌క‌ర్త‌ల‌కే కేటాయించామ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మ‌రోవైపు వ‌లంటీర్లు వ‌చ్చాకే త‌మ‌కు ప్రాధాన్య‌త లేకుండా పోయింద‌ని వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని అంటున్నారు. ప్ర‌తి చిన్న ప‌నికి ప్ర‌జ‌లు వ‌లంటీర్ల‌ను సంప్ర‌దిస్తున్నార‌ని.. ఇలా అయితే త‌మ‌కు గుర్తింపు ఏముంటుంద‌నేది వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల ఆవేద‌నగా ఉంద‌ని చెబుతున్నారు.

కార్య‌క‌ర్త‌లకు గుర్తింపు లేక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ కోసం ఎలా ప‌నిచేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో గ్రామ క‌మిటీలను వేయాల‌ని అంటున్నార‌ని.. వ‌లంటీర్ల‌తోనే గ్రామ క‌మిటీలు వేసుకోవ‌చ్చు క‌దా అని నేత‌ల‌ను నిల‌దీస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో మంత్రి తానేటి వ‌నిత మాత్రం వైఎస్ఆర్సీపీ కార్య‌క‌ర్య‌ల‌కు, వారి కుటుంబాల‌కే వ‌లంటీర్లుగా అవ‌కాశ‌మిచ్చాం అని చెప్ప‌డంపై కార్య‌క‌ర్త‌ల నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు. వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌కు వ‌లంటీర్లుగా అవ‌కాశ‌మిస్తే త‌మ‌కు బాధ ఎందుకు ఉంటుంద‌ని నిల‌దీస్తున్నార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News