మంత్రివర్గంలో భారీ మార్పులు... నా పదవి పోయినా భయపడను: బాలినేని

Update: 2021-09-25 14:30 GMT
అమరావతి: మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రివ‌ర్గ విస్తరణలో భారీగా మార్పులుంటాయని ప్రకటించారు. గ‌తంలో సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన‌ట్లుగానే రెండున్నరేళ్ల పాల‌న త‌ర్వాత కొత్త వారికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కుతాయ‌ని బాలినేని స్ప‌ష్టం చేశారు. కేబినెట్‌లో వందశాతం మార్పులుంటాయని గతంతో సీఎం జగన్ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. తన మంత్రి పదవి పోయినా భయపడనని, తనకు పార్టీ ముఖ్యమని శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బాలినేని ఈ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి రెండు సంవత్సరాలు నాలుగు నెలలు పూర్తి అవుతోంది. మరో రెండు నెలల్లో రెండున్నరేళ్లు పూర్తి అవుతోంది. 2019లో ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన తర్వాత జరిగిన వైసీపీ శాసనసభాపక్షాసమవేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా జగన్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నియమించబోయే మంత్రులు రెండున్నరేళ్ల మాత్రమే ఉంటారని, ఆ తర్వాత మొత్తం కేబినెట్‌లో 80 నుంచి 90 శాతం వరకు కొత్తవారికి అవకాశం ఇస్తామని ప్రకటించారు. అయితే ఇటీవల కాలంలో రెండు సార్లు కరోనా రావడంతో దాదాపు రెండు, మూడు నెలలు మంత్రులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఈ కేబినెట్‌ను మూడు సంవత్సరాల పాటు కొనసాగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జగన్ చేస్తున్నారని సీఎం వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది మంత్రుల వద్ద కూడా జగన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గతంలో ప్రకటించిన నిర్ణయానికే జగన్ కట్టుబడి త్వరలో కొత్త కేబినెట్‌ను ఎన్నుకుంటారని చెబుతున్నారు.




Tags:    

Similar News