వెన్నుపోటు పై మంత్రి గంగుల హెచ్చరికలు..

Update: 2019-12-31 06:18 GMT
పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గెలిచినప్పటి నుంచి మంత్రి గంగుల కమలాకర్ కు పక్కలో బల్లెంలా తయారయ్యాడట. గంగులను దాదాపు ఓడించినంత పనిచేశాడు. అయితే చావు తప్పు కన్నులొట్టబోయిన చందంగా గంగుల కరీంనగర్ ఎమ్మెల్యే గా గెలిచాడు. గంగుల ఓటమికి టీఆర్ఎస్ లోనే ఉన్న మాజీ మేయర్, కొందరు కార్పొరేటర్లు బండి సంజయ్ కు సహకరించారనే ప్రచారం ఉంది. బండి సంజయ్ దూకుడు చూసే కేసీఆర్ కంచుకోట అయిన కరీంనగర్ లో బలం తగ్గకుండా గంగులకు మంత్రి పదవి ఇచ్చారనే ప్రచారం ఉంది..

అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ కార్పొరేషన్ ను చేజిక్కించుకునేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. దీంతో గంగుల కూడా తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. టీఆర్ఎస్ ను కరీంనగర్ లో గెలిపించేందుకు శాయశక్తుల ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ప్రస్తుతం మంత్రి గంగుల కు, మాజీ మేయర్ అయిన రవీందర్ సింగ్ కు పడడం లేదు. మరి మున్సిపల్ ఎన్నికల వేళ తాజాగా గంగుల హెచ్చరికలు పంపారు. ‘తనకు వెన్నుపోటు పొడిచినా ఫర్వాలేదు కానీ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదని’ స్పష్టం చేశారు. ఈ వార్నింగ్ మాజీ మేయర్ కేనంటున్నారు.

మరి కార్పొరేషన్ ఎన్నికల్లో మాజీ మేయర్ కు గంగుల టికెట్ ఇస్తారా? మాజీ మేయర్ ను మళ్లి కలుపుకొని ప్రచారం చేస్తారా? వెన్ను పోటు దారులను దూరం పెడుతారా అన్నది ఆసక్తిగా మారింది.
Tags:    

Similar News