నారాయ‌ణ‌..సుజ‌నా..సీఎం ర‌మేశ్‌..త‌ర్వాత ఎవ‌రు?

Update: 2018-10-13 11:22 GMT
అన్ని బాగున్న‌ప్పుడు అంతా బాగున్న‌ట్లుగా ఉండ‌టం.. ఆరోప‌ణ‌లు వ‌చ్చినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌టం నేటి రాజ‌కీయం. ట‌ర్మ్స్ బాగున్న‌ప్పుడు లోకం ప‌చ్చ‌గా ఉన్న‌ట్లు క‌నిపించినా..తేడా వ‌చ్చినంత‌నే అస‌లు విష‌యాల మీద క‌న్నెర్ర చేయ‌టం.. త‌మ‌కు వ్య‌తిరేకంగా మారిన వారిపై కేసుల చిక్కుల వ‌ల విస‌ర‌టం గ‌డిచిన కొంత‌కాలంగా వ‌స్తున్న‌దే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి రాజ‌కీయం కొత్తేం కాదు.

నాలుగున్న‌రేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌తో ఆయ‌న‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేత‌లు ప‌లువురిపై వ‌చ్చిన ఆరోప‌ణ‌లు అన్ని ఇన్ని కావు. వారి వ్యాపారాల విష‌యంలోనూ.. వారికి వ‌చ్చే కాంట్రాక్ట్ ల విష‌యంలోనూ బోలెడ‌న్ని చ‌ర్చ‌లు జ‌రిగినా.. వాటిని ప‌ట్టించుకున్న నాథుడే లేని ప‌రిస్థితి. అయితే.. అదంతా గ‌తం. కేంద్రంలోని మోడీ సర్కారుతో స్నేహంగా ఉన్నంత కాలం తెలుగు త‌మ్ముళ్ల మీద ఎన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చినా.. పెద్ద‌గా ప‌ట్టించుకోని విచార‌ణ సంస్థ‌లు.. ఇప్పుడు మాత్రం య‌మా యాక్టివ్ గా మారిపోయాయి.

ఎప్పుడైతే కేంద్రంలోని మోడీ స‌ర్కారుతో చంద్ర‌బాబుకు లెక్క తేడా వ‌చ్చిందో.. అప్ప‌టి నుంచే తెలుగు త‌మ్ముళ్ల‌కు కౌంట్ డైన్ మొద‌లైంద‌న్న మాట జోరుగా వినిపించింది. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా ఒక‌రి త‌ర్వాత ఒక‌ర‌న్న‌ట్లుగా ఐటీ త‌నిఖీలు షురూ అయ్యాయి. మొన్న‌టి వ‌ర‌కూ టీడీపీలో ఉండి.. ఈ మ‌ధ్య‌నే కాంగ్రెస్‌లో చేరిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టికి అన‌ధికారికంగా తెలుగు త‌మ్ముడిగా వ్య‌వ‌హ‌రించే రేవంత్ రెడ్డి సంగ‌తే చూస్తే.. త‌న‌పై విచార‌ణ సంస్థ‌లు క‌త్తి దూస్తాయ‌ని.. త‌నిఖీల పేరుతో దాడులు చేస్తారంటూ అదే ప‌నిగా చెప్ప‌టం.. ఆయ‌న చెప్పిన‌ట్లే ఆయ‌న ఇల్లు.. ఆఫీసుల్లో దాడులు జ‌ర‌గ‌టం తెలిసిందే.

తెలంగాణ‌లో రేవంత్ ఇంట జ‌రిగిన త‌నిఖీల ప‌ర్వం ఓవైపు సాగుతున్న వేళ‌లోనే.. ఏపీ టీడీపీ నేత‌లు బీద మ‌స్తాన్‌రావు ఆస్తుల మీదా.. త‌ర్వాత నారాయ‌ణ‌.. రీసెంట్ గా సుజ‌నా చౌద‌రి ఆస్తుల మీద త‌నిఖీల ప‌ర్వం సాగింది. నిన్న‌టి (శుక్ర‌వారం) నుంచి  బాబుకు స‌న్నిహిత‌మైన సీఎం ర‌మేశ్ ఆస్తుల మీద పెద్ద ఎత్తున త‌నిఖీలు జ‌రుగుతున్నాయి.  దీంతో. త‌మ్ముళ్ల‌లో అలెర్ట్ నెస్ ఎక్కువైంది. త‌మ పార్టీ నేత‌ల‌పై సాగుతున్న త‌నిఖీల‌పై చంద్ర‌బాబు గ‌ళం విప్పారు. ఇదంతాఏపీపై జ‌రుగుతున్న దాడిగా బాబు మండిప‌డుతున్నారు.

త‌మ‌ను దారికి తేవాల‌న్న ఉద్దేశంతోనే మోడీ స‌ర్కారు త‌మ‌పై ఈ త‌నిఖీల అస్త్రాన్ని సంధించింద‌ని చెబుతున్నారు. ఇలాంటి రాజ‌కీయ వ్యాఖ్య‌లు మామూలే. ఆ విష‌యాన్ని వ‌దిలేస్తే.. ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. త‌ర్వాతి త‌నిఖీలు జ‌రిగేది ఎవ‌రి మీదా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం సీఎం ర‌మేశ్ త‌ర్వాత.. ఏపీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు మీద త‌నిఖీల ప‌ర్వం సాగుతుంద‌ని చెబుతున్నారు.
బ‌ల‌మైన ఆర్థిక‌మూలాలు.. వ్యాపారాలు..కాంట్రాక్టులు చేసే నేత‌లంద‌రిపైనా వ‌రుస‌గా త‌నిఖీలు సాగుతాయ‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యానికి టీడీపీ ఆర్థిక మూలాల‌పై త‌నిఖీలతో అష్ట‌దిగ్బంద‌నం చేసే అవ‌కాశాలే ఎక్కువ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. మ‌రి.. మోడీ అండ్ కో ప్లాన్ ఇదే రీతిలో సాగుతుందా?  లేక మారుతుందా? అన్న‌ది కాల‌మే స‌మాధానం చెప్పాలి
Tags:    

Similar News