ప్రధానిని ప్రశ్నించిన తెలుగు విద్యార్థినికి మంత్రి గిఫ్ట్ .. ఏం ఇచ్చారంటే?

Update: 2021-04-09 06:35 GMT
ఇంకొద్ది రోజుల్లోనే  విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు పలు తరగతుల విద్యార్థులను ప్రమోట్ చేశాయి. కానీ, పదో తరగతితో పాటు ఇంటర్, డిగ్రీ, పీజీ పరీక్షలు యధాతధంగా నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లింది చాలా తక్కువ. ఆన్ లైన్‌ లోనే ఎక్కువగా క్లాసులు విన్నారు. ఈ క్రమంలో పరీక్షల వేళ విద్యార్థుల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఈసారి పరీక్షలు ఎలా రాయాలో అని ఆందోళన పడుతున్నారు. అలాంటి విద్యార్థులకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. బుధవారం పరీక్షా పే చర్చలో భాగంగా పలువురు విద్యార్థులతో ముచ్చటించారు. పరీక్షలు దగ్గర పడుతున్న వేళ.. వారిలో ఆందోళనను తగ్గించి ధైర్యం నింపడ కోసం ఈ కార్యక్రం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులత మోదీ మాట్లాడారు. మొదట ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన 9వ తరగతి విద్యార్థిని పల్లవి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. పల్లవి ప్రధాని తో మాట్లాడుతూ .. కరోనా ప్రభావంతో ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పరీక్షలు దగ్గర పడుతుండటంతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నాం. భయాన్ని వీడి ఏకాగ్రతతో పరీక్షలు రాసేందుకు ఉపాయం చెప్పండిని ఆమె కోరింది. దానికి ప్రధాని మోడీ సమాధానం ఇస్తూ ...పరీక్షలంటే భయపడవద్దు. మనల్ని మెరుగుపరచుకునేందుకు ఉపకరించేవిగా వాటిని చూడండి. కొన్నిసార్లు సామాజిక, కుటుంబ వాతావరణం కూడా విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుంది. ఒత్తిడి లేకపోతే విద్యార్థులు పరీక్షలను భారంగా భావించరు. కష్టంగా అనిపించిన సబ్జెక్టుల నుంచి దూరంగా పారిపోవద్దు. నా వరకు నేను కష్టమైన పనిని ఉదయాన్నే చేస్తాను. అప్పుడైతే ప్రశాంతంగా ఉంటుంది. సులభమైన పనుల్ని రాత్రి పొద్దుపోయాక చేస్తుంటాను అని ప్రధాని చెప్పారు

అలాగే ప్రధాని మోడీ మాట్లాడుతూ .. విద్యార్థులపై తల్లిదండ్రులతో పాటు అధ్యాపకులు, మిత్రులు ఒత్తిడి చేయడం మానేయాలని, అప్పుడే వారు పరీక్షలకు స్వచ్ఛగా సన్నద్ధం కాగలరని, పరీక్షలు చాలా సులభతరమవుతాయని చెప్పారు. పరీక్షల గురించి విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని సూచించారు ప్రధాని మోదీ. పిల్లల మెదళ్లలో అనవసరపు భయాందోళనలు రేకెత్తించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ప్రధానితో దైర్యంగా మాట్లాడి , తన ప్రశ్నను అడిగిన  ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని పల్లవిని(9వ తరగతి) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అభినందించారు. ఆమె ఉన్నత విద్యకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. గురువారం మార్కాపురం పట్టణం లక్ష్మీచెన్నకేశవనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యార్థినికి అభినందన కార్యక్రమం జరిగింది. తల్లిదండ్రులు మోహనరావు, సంపూర్ణ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావుతో కలిసి వచ్చిన పల్లవితో మంత్రి మాట్లాడారు. ఎంతో ధైర్యంగా ప్రశ్న అడిగావు. ప్రధాని సమాధానం ఇచ్చారు. శభాష్‌ పల్లవి.. అంటూ మెచ్చుకున్నారు. విద్యార్థినితో పాటు తల్లిదండ్రులను సత్కరించారు. రూ.25వేల విలువ గల టీవీతో పాటు డిక్షనరీ బహూకరించారు.
Tags:    

Similar News