అదృష్టమంటే ఈ మంత్రిదే.. జైలులో మసాజులు, మర్దనాలు!

Update: 2022-11-19 08:18 GMT
దేశంలో కొందరికి చట్టం చుట్టమనే విమర్శలున్నాయి. డబ్బు, పలుకుబడి ఉంటే ఎక్కడ ఉన్నా రాజభోగాలే అన్నట్టు ఉంది పరిస్థితి. ఇక వడ్డించేవాడు మనవాడైతే ఇక బంతిలో చివర కూర్చున్నా, ఇంటిలో కూర్చున్నా మనది మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగే ఉంది ఒక మంత్రి పరిస్థితి. జైలులో ఉన్నా సకల రాజభోగాలు అనుభవిస్తున్నాడు.. ఈ మంత్రి.

జైలులో సకల భోగాలు అనుభవిస్తున్న ఈ మంత్రిగారి విషయానికొస్తే.. ఢిల్లీలో అరవింద్‌ కేజ్రీవాల్‌ నాయకత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ మంత్రివర్గంలో ఒక మంత్రే.. సత్యేంద్రకుమార్‌ జైన్‌. మనీలాండరింగ్‌ కేసులో ఈ ఏడాది మే 30న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఆయనను అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఢిల్లీలోని తీహార్‌ జైలులో ఉన్నాడు.

అయితే ఢిల్లీలో ఉంది తమ పార్టీ ప్రభుత్వమే కావడం సత్యేంద్రకుమార్‌ జైన్‌కు కలిసి వచ్చింది. తీహార్‌ జైలులో ఖైదీగా ఉన్నప్పటికీ ఈయన గారికి సకల రాజభోగాలు అందుతున్నాయి. థాయ్‌ స్పెషల్‌ మసాజులు, మర్ధనాలు, ప్రత్యేకమైన ఆహారం, డబుల్‌ కాట్‌ బెడ్, ప్రత్యేక జైలు గది, అందులో టీవీ, రిమోట్‌ ఇలా ఒకటేమిటి రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అన్ని భోగాలు సత్యేంద్రకుమార్‌ జైన్‌కు దక్కుతున్నాయి.

అయితే ఎలా వచ్చిందో కానీ జైలులో మంచంపైన విలాసంగా పడుకుని థాయ్‌ మసాజు చేయించుకుంటున్న సత్యేంద్రకుమార్‌ జైన్‌ వీడియో ఒకటి బయటకొచ్చింది. ఇంకేముంది.. ఈ వ్యవహారంపైన గగ్గోలు రేగింది. విచారణలో తేలిందేమిటంటే.. సత్యేంద్రకుమార్‌ జైన్‌ అరెస్టు అయినప్పటి నుంచి ఆయనకు సకల రాజభోగాలు జైలులో అందుతున్నాయని వెల్లడైంది.

జైలులో ఆయనకు ఓ వ్యక్తి మసాజ్‌ చేసు, కాళ్లకు నూనె రాసి మర్దన చేస్తుండటం, గదిలో బిస్లరీ వాటర్‌ బాటిల్స్‌ వంటి దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ఇది సెప్టెంబరు 13 నాటి వీడియో అని చెబుతున్నారు. ఆ తర్వాతి రోజు కూడా సత్యేంద్రకుమార్‌ జైన్‌కు బాడీ మసాజ్‌తోపాటు తలకు మర్దనా చేసిన వీడియో కూడా బయటకు వచ్చిందని తెలుస్తోంది.

సత్యేంద్రకుమార్‌ జైనుకు జైలులో వీఐపీ మర్యాదలు చేస్తున్నారనే ఆరోపణలు వెలుగుచూడటంతో దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను ఈడీ కోర్టుకు సమర్పించింది. దీంతో తీహార్‌ జైలు సూపరింటెండ్‌తోపాటు మొత్తం 10 మంది జైలు అధికారులపై వేటు పడింది.

నీతి, నియమాలు, అవినీతిరహిత పాలన, నిజాయితీ, పారదర్శకత అంటూ అధికారంలోకి వచ్చిన ఆప్‌కు ఈ వీడియో తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. అందులోనూ డిసెంబర్‌ 1, 5 తేదీల్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

గుజరాత్‌పైన ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్ద ఆశలే పెట్టుకుంది. తాను మంచి ఫలితాలు సాధించగలనని విశ్వసిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ మంత్రి సత్యేంద్రకుమార్‌ జైన్‌ వీడియోలు వెలుగు చూడటం, వీటిపైన బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తుండటంతో ఆప్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News