ఏపీ టీడీపీలో అప్పుడే ఇంటిపోరు మొద‌లైందా?

Update: 2018-11-15 10:49 GMT
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి నిజంగానే ఇప్పుడు ఊహించ‌ని షాకులు త‌గులుతున్నాయి. త‌న‌దైన మార్కు పాల‌న‌తో ఏపీలో నానాటికీ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకుంటున్న ఆ పార్టీ అధినేత‌ - సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... ఆ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను ఎలాగైనా త‌గ్గించుకోవాల‌ని అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవ‌కాశాన్నీ వ‌దులుకునేందుకు సిద్ధంగా లేరు. ఈ క్ర‌మంలోనే ఏ పార్టీకి వ్య‌తిరేకంగా అయితే టీడీపీ పురుడుపోసుకుందో - ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీతో చెలిమికి జైకొట్టింది. అస‌లు కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపై జ‌నం ఏమ‌నుకుంటార‌న్న దాన్ని గ‌ట్టున ప‌డేసిన చంద్ర‌బాబు... త‌న గెలుపే త‌న‌కు ప‌ర‌మావ‌ధి అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయితే కాంగ్రెస్‌ తో దోస్తీ క‌ట్టినా... పాత స‌మ‌స్య‌లు స‌ద్దుమ‌ణ‌గ‌క‌పోగా... కొత్త‌గా మ‌రిన్ని త‌ల‌నొప్పులు మొద‌ల‌య్యాయి.

కాంగ్రెస్‌ తో మైత్రితో తెలంగాణ‌లోని హైద‌రాబాదు ప‌రిస‌ర ప్రాంతాల్లో టీడీపీకి అంతో ఇంతో బ‌ల‌ముందనుకుంటున్న స్థానాల్లోనూ కొత్త అల‌జ‌డులు మొద‌ల‌య్యాయి. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకా ఆరు నెల‌ల స‌మ‌యం ఉన్నా కూడా అప్పుడే... పార్టీతో గ్రూపు రాజ‌కీయాలు మొద‌లైపోయాయి. అది కూడా త‌న‌కు మంచి బ‌ల‌ముంద‌ని పార్టీ భావిస్తున్న అనంత‌పురం జిల్లాలో ఈ త‌ర‌హా త‌గాదాలు ర‌చ్చెకెక్క‌గా... వాటిని ఎలా ప‌రిష్క‌రించాలో కూడా తెలియ‌క చంద్ర‌బాబు స‌త‌మ‌త‌మైపోతున్నార‌ట‌. ఇక ఈ ర‌చ్చ మొద‌లైన నియోజ‌క‌వ‌ర్గం ఏ చిన్నా చిత‌క నేత‌దో అయితే ఫ‌ర‌వా లేదు గానీ... బాబు కోట‌రీలో ముఖ్యుడిగా - బాబు కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్న కాల్వ శ్రీ‌నివాసులు నియోజ‌క‌వ‌ర్గంలో ఈ త‌గాదా నిజంగానే టీడీపీకి త‌ల‌కు మించిన భారంగా మారడం ఖాయ‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయినా అక్క‌డ ర‌చ్చ‌కెక్కిన వ్య‌వ‌హారం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... అనంత‌పురం జిల్లా రాయ‌దుర్గం అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గం నుంచి గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో కాల్వ శ్రీ‌నివాసులు విజ‌యం సాధించారు. ఆ వెంట‌నే చీఫ్ విప్ ప‌ద‌విని ద‌క్కించుకున్న కాల్వ‌... త‌ద‌నంత‌ర కాలంలో బాబు మెప్పు పొంది ఏకంగా మంత్రిగిరీని ప‌ట్టేశారు. ఇంత‌దాకా బాగానే ఉన్నా... పార్టీకే చెందిన సీనియ‌ర్ నేత‌ - రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గానికి గ‌తంలో ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించిన మాజీ ఎమ్మెల్యే మెట్టు గోవింద‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు నిజంగానే అటు కాల్వ‌తో పాటు ఇటు చంద్ర‌బాబుకు ఊహించ‌ని షాకిచ్చాయ‌ని చెబుతున్నారు. అయినా గోవింద‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... రాయదుర్గం మండలం హనుమాపురంలో నిన్న‌టి పర్యటనలో భాగంగా... 2019 ఎన్నిక‌ల్లో రాయ‌దుర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాన‌ని, రేసులో తాను కూడా ముందున్నాన‌ని ఆయ‌న సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బ‌హిరంగ వేదిక‌పైనే గోవింద‌రెడ్డి చేసిన ఈ ప్ర‌క‌ట‌న టీడీపీ శ్రేణుల్లో అల‌జ‌డిని సృష్టించింద‌నే చెప్పాలి. పార్టీ అధిష్ఠానం తనకు టికెట్‌ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో చూపిస్తానని కూడా ఆయ‌న ఏకంగా కాల్వ‌కు స‌వాలు విసిరేశారు. అంత‌టితో ఆగ‌ని ఆయ‌న‌ ప్రజాసేవలో మరింత సమయం గడపాలని, ఇంకా చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రాయదుర్గంలోనే ఇల్లు కట్టుకుని ఇకమీదట ఇక్కడే గడపబోతున్నానని చెప్పుకొచ్చారు.

అయినా ఓ మంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంపై సొంత పార్టీకే చెందిన నేత నోట నుంచి ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు ఎలా వ‌చ్చాయ‌న్న విష‌యంలోకెళితే... త‌న పార్టీ ఎమ్మెల్యేల‌తో పాటు మంత్రుల ప‌నితీరు, వారి భ‌విష్య‌త్తు, నియోజక‌వ‌ర్గాల‌పై ఆయా నేత‌ల ప‌ట్టుపై చంద్ర‌బాబు ఎడాపెడా స‌ర్వేలు చేయిస్తుంటారు క‌దా. ఈ స‌ర్వేల్లో రాయ‌దుర్గంలో వ‌చ్చేసారి కాల్వ పోటీ చేస్తే... టీడీపీకి ఓట‌మి ఖాయ‌మ‌ని తేలింద‌ట‌. ఈ నేప‌థ్యంలో కాల్వ‌ను రాయ‌దుర్గం నుంచి కాకుండా వేరే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దించాల‌ని పార్టీ భావిస్తోంద‌ట‌. అంతేకాకుండా అస‌లు కాల్వ‌కు రాయ‌దుర్గంలోనే ప‌రిస్థితి ఇలా ఉంటే... మిగిలిన చోట్ల ఆయ‌న ఎలా గెలుస్తార‌న్న కోణంలోనూ పార్టీ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతోంద‌ట‌. ఈ క్ర‌మంలో అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాల్వ‌కు సీటు ద‌క్కే విష‌యంలోనూ స్ప‌ష్ట‌త లేద‌ట‌. ఈ విష‌యాల‌న్నీ గ్ర‌హించిన మీద‌టే గోవింద రెడ్డి నేరుగా రంగంలోకి దిగిపోయార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా... స‌రిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీట్ల గోల‌తో త‌ల వేడేక్కిపోయిన ప్ర‌స్తుత త‌రుణంలోనే ఇలాంటి గోల ఏపీలో రేగడం నిజంగానే చంద్ర‌బాబుకు షాకింగ‌నే చెప్పాలి. అయితే త‌న బ‌లం తెలుసో, లేదో తెలియ‌దు గానీ... కాల్వ మాత్రం గోవింద రెడ్డి వ్యాఖ్య‌ల‌పై కిమ్మ‌న‌కుండా ఉండిపోవ‌డంతో పాటు త‌న భ‌విష్య‌త్తుకు చంద్ర‌బాబుదే పూచీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో?

   
   
   

Tags:    

Similar News