తాగుబోతు అధికారి కంటే కూలోడు, రిక్షా పుల్లర్ నయం.. కేంద్ర మంత్రి నిష్టూరం

Update: 2022-12-25 12:02 GMT
''ఓ తాగుబోతు అధికారి కంటే కూలీ పనిచేసుకునేవాడు, రిక్షా తోలుకునే కార్మికుడు నయం. మీ పిల్లలు, సోదరీమణులకు వివాహ సంబంధాలు చూసేటప్పుడు ఆ వ్యక్తికి మద్యం తాగే అలవాటుందా? లేదా? అని కనుక్కోండి.

మద్యం తాగేవారి జీవిత కాలం స్వల్పం..'' ఈ మాటలన్నది ఏ సైకాలజిస్టో, లేక ఉపాధ్యాయడో కాదు..సాక్షాత్తు కేంద్ర మంత్రి వ్యాఖ్యలివి. చెట్టంత కొడుకుని కోల్పోయిన ఆవేదనలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ మంత్రి కౌశల్ కిశోర్ ఉత్తరప్రదేశ్ లో సీనియర్ బీజేపీ నేత. మోహనలాల్ గంజ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓ డీ అడిక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మద్యం వ్యసనం ఎంత ప్రమాదకరమో సొంత అనుభవంతో వివరిస్తూ చెప్పారు.

తాగుడుకు బానిసైన మంత్రి కుమారుడు..కౌశల్ కిశోర్ భార్య ఎమ్మెల్యే. స్నేహితులతో తిరుగుతూ వీరి కుమారుడు ఆకాశ్ మద్యానికి బానిసయ్యాడు. అదే పనిగా తాగుతూ ఉండడంతో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని డీ అడిక్షన్ కేంద్రంలో చేర్చారు.

ఇక మద్యం ముట్టుకోడనే మాట మేరకు అక్కడినుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆర్నెల్లకు పెళ్లి చేశారు. కానీ, పెళ్లి అనంతరం ఆకాశ్ మళ్లీ తాగుడు మొదలుపెట్టాడు. 2020 అక్టోబరు 19న అతడు చనిపోయాడు.

ఆకాశ్ కు అప్పటికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. వ్యక్తిగతంగా ఎదురైనా ఈ చేదు అనుభవాన్ని గుర్తుచేసుకునే కేంద్ర మంత్రి.. మద్యం వ్యసనపరుల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. ''నేను ఎంపీని, నా భార్య ఎమ్మెల్యే. కానీ ఏం లాభం నా కుమారుడిని కాపాడుకోలేకపోయాం'' అంటూ ఆదివారం ఓ కార్యక్రమంలో వాపోయారు. 80 శాతం కేన్సర్ మరణాలు పొగ తాగడం కారణంగానే సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ''స్వాతంత్ర్యోద్యమం 90 ఏళ్లలో 6.32 లక్షల మంది బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు కోల్పోయారు. కానీ, మద్యం వస్యనం కారణంగా ఏటా 20 లక్షల మంది చనిపోతున్నారు.

నా కుమారుడిని నేను కాపాడుకోలేకపోయాను. నా కోడలు ఇప్పుడు వైధ్యవ్యం పొందింది. ఇలాంటి పరిస్థితి మీ చెల్లెళ్లు, కూతుళ్లకు రానీయొద్దు'' అని కేంద్ర మంత్రి అభ్యర్థించారు. డి అడిక్షన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని.. వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యసనాలు ఎంత ప్రమాదకరమో వివరిస్తూ విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని.. విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని కోరారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News