కేటీఆర్ నోటి నుంచి ఇలాంటి లూస్ వర్డ్స్ నా?

Update: 2022-10-14 04:31 GMT
రాజకీయాలు అంటే అంతే.. 'అయినవారికి కంచెంలో.. కానివారికి విస్తరాకులో భోజనాలు పెట్టేస్తారు'.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ అంతే.. తమది కాని నియోజకవర్గాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉప ఎన్నికలు వస్తే కానీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతున్న దాఖలాలు లేవు. తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి చెందిన నియోజకవర్గాలు ఏవయ్యా అంటే వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.. ఒకటి కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ కాగా.. రెండోది హరీష్ రావు ఎమ్మెల్యేగా గెలిచిన సిద్ధిపేట.. మూడోది మంత్రి కేటీఆర్ ను గెలిపించిన సిరిసిల్ల. ఈ మూడు కాక ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన హుజూరాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ అభివృద్ధి చేసింది.మిగతావన్నింటిని గాలికి వదిలేసిందన్న విమర్శలున్నాయి..

అందుకే ఉప ఎన్నికలు వస్తేనే తమ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయగానే అక్కడ ఇంటికి రూ.10 లక్షల చొప్పున కేసీఆర్ సార్ దళితబంధు పేరిట పంచాడు. ఓటుకు 6వేల నుంచి 10వేల దాకా పంచారు. ఇది చాలదా జనాల ఆకలి తీరడానికి.. ఇక రోడ్లు, మౌళిక వసతులు చిటికెలో అయిపోయాయి.

దీన్ని బట్టి అధికార టీఆర్ఎస్ కీలక నేతల నియోజకవర్గాలు.. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాలే తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నాయి. మిగతావన్నింటిని గాలికి వదిలేస్తున్న పరిస్థితి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నియోజకవర్గాలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.

తాజాగా మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని.. సిరిసిల్ల తరహాలో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. ఇదే అక్కడి ప్రజలు, నెటిజన్లలో ఆగ్రహం తెప్పించింది. అంటే సిరిసిల్లను మాత్రమే డెవలప్ చేసి మిగతా నియోజకవర్గాలను వదిలేశానని కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. సిరిసిల్లకే మంత్రి కానీ.. మునుగోడుకు కాదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

అధికారంలో ఉండి మునుగోడును పట్టించుకోని కేటీఆర్ గెలిపిస్తేనే దత్తత తీసుకొని డెవలప్ చేస్తానన్న మాట వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించినందుకే డెవలప్ చేయలేదా? అని ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా మాట్లాడాల్సిన మాటలు కాదని కేటీఆర్ కు హితవు పలుకుతున్నారు.

కేటీఆర్ మంత్రిగా ఆలోచించడం లేదని.. కేవలం పార్టీ కార్యకర్తగా ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేలా మాట్లాడారని హితవు పలుకుతున్నారు. మొత్తానికి ఎక్కడా మాట తూలకుండా జాగ్రత్తగా మాట్లాడే కేటీఆర్ ఈ ఒక్క మాటతో అందరికీ అడ్డంగా బుక్కైన పరిస్థితి నెలకొంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News