బండిని పుసుక్కున అంత మాట అనేసిన కేటీఆర్

Update: 2022-09-15 15:30 GMT
మర్యాద అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి. తెలుగు రాజకీయాల్లోనూ.. రాజకీయ నేతల్లోనూ మిస్ అయిన పాయింట్ ఏమైనా ఉందంటే మర్యాదే. ఒకరిని ఉద్దేశించి మరొకరు మాట్లాడేవేళ.. ఎంత వీలైతే అంత ఎగతాళిగా మాట్లాడటం.. ఎటకారాలు ఆడేసుకోవటం లాంటివి ఇటీవల కాలంలో ఎక్కువ అవుతున్నాయి. అంతేకాదు.. పలు సందర్భాల్లో హద్దులు దాటేసేలా మాటల్ని మాట్లాడేస్తున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ను ఉద్దేశించి 'మరమనిషి' అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఆయన్ను ఏకంగా సెషన్ మొత్తం నుంచి తప్పించేయటం తెలిసిందే.

తన చర్యల ద్వారా.. మాట్లాడే మాటల్లో ఇసుమంత తప్పు కూడా దొర్లకూడదన్నట్లుగా కేసీఆర్ చర్యలు ఉన్నాయి. మరి.. ఆయన కుమారుడు కమ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి మాత్రంతన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం కనిపిస్తోంది. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. అంత మాత్రానికి మిగిలిన వారి మాదిరి నోటికి వచ్చినట్లుగా మాట్లడటంలో అర్థం లేదు. నిజంగానే సహేతుకమైన విమర్శల్ని చేసే వారి విషయాన్ని పక్కన పెడితే.. కేటీఆర్ లాంటి ఉన్నత స్థానంలో ఉన్న వారు సైతం రోటీన్ రాజకీయ నేత మాదిరి మాట్లాడటమా? అన్న విస్మయానికి గురి కాక మానదు.

తెలంగాణ బీజేపీ రథసారధి బండి సంజయ్ ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ కాస్తంత తీవ్రమైన వ్యాఖ్యల్ని చేశారు. ఓవైపు విశ్వగురువు (మోడీ) ఉచితాలు వద్దంటుంటే.. జోకర్ ఎంపీ మాత్రం ఉచిత విద్య.. వైద్యం.. ఇళ్లు ఇస్తామని చెబుతున్నారన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయన తీవ్రమైన ఒత్తిడితో ఉన్న భావన కలుగక మానదు. ఎందుకంటే.. మోడీ సర్కారు ఉచితాలకు వ్యతిరేకమన్న విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. అదే నిజమైతే.. ఉత్తరప్రదేశ్ లో నెలసరి రెండు సార్లు రేషన్ ఎలా ఇస్తారు? పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పథకాల మాటేమిటి?

ఉచితాలు ఇవ్వాలే కానీ అవి అనుచితాలుగా మారకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయితే.. ఇదే విషయాన్ని తనదైన శైలిలో మార్చేసిన కేటీఆర్.. తమపై అదే పనిగా విరుచుకుపడుతున్న బండి సంజయ్ ను ఏకంగా జోకర్ ఎంపీ అనేందుకు సైతం వెనుకాడలేదు.

దేశం మొత్తానికి ఉచిత విద్య.. వైద్యం.. ఇళ్లు ఇచ్చేలా పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టకుండా మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారంటూ ట్విటర్ వేదికగా చేసుకొని కేటీఆర్ వినిపిస్తున్న వాదన చూస్తే.. కేటీఆర్ లో సహజ సిద్ధంగా ఉండే సెన్సాఫ్ హ్యుమర్ తో పాటు.. లాజిక్ మిస్ కావటం ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పకతప్పదు.

తాజాగా బండి సంజయ్ హైదరాబాద్ మహానగరంలోని పలు నియోజకవర్గాల్లో తన తదుపరి ప్రజా సంగ్రామ పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పాదయాత్రలో ఆయన ఇస్తున్న హామీలపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనను జోకర్ ఎంపీగా పేర్కొన్న కేటీఆర్ పై బండి సంజయ్ మరింత ఘాటైన పదజాలాన్ని వాడే అవకాశమే ఎక్కువన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News