కరెన్సీ నోట్లపై మోడీ ఫొటో పెట్టేయండి.. నిర్మలకు కేటీఆర్ సెటైర్ అదుర్స్

Update: 2022-09-16 09:50 GMT
బీజేపీని అదునుచూసి దెబ్బకొట్టడంలో... మాటల తూటాలు పేల్చడంతో ఈ కల్వకుంట్ల తండ్రీకొడుకుల రూటే సపరేటు. మొన్న తెలంగాణలోని కామారెడ్డిలో కలెక్టర్ ను మోడీ ఫొటో రేషన్ షాపుల్లో పెట్టలేదని బెదిరించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై టీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకున్నారు.

మోడీ ఫొటోను పెరిగిన గ్యాస్ సిలిండర్లకు అతికించి టీఆర్ఎస్ శ్రేణులు తెలిపిన నిరసన హైలెట్ అయ్యింది. మోడీని, బీజేపీ విధానాలను ఎండగట్టడంలో ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ముందుంటున్నారు.

బీజేపీ నేతలపై విమర్శలు చేయడంలో తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే ముందు ఉంటారు మంత్రి కేటీఆర్. ఎప్పటికప్పుడు ట్వీట్టర్ లో ఆయన వేసే సెటైర్లు బాగా పేలుతుంటాయి.  మీడియా ముందర కూడా బండి సంజయ్ సహా బీజేపీ నేతల విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తుంటారు.

తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో పంచ్ వేశారు.అహ్మదాబాద్లోని ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్రమోడీ కాలేజీగా మార్చడాన్ని ఉద్దేశిస్తూ కేంద్రం తీరుపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. మణినగర్ ప్రాంతంలో ఏఎంసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 'ఎల్జీ మెడికల్ కాలేజీని' ఏకంగా 'నరేంద్రమోడీ మెడికల్ కాలేజీ'గా మారుస్తూ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

 గుజరాత్ లో ఇప్పటికే 'సర్దార్ పటేల్ స్టేడియం' పేరును నరేంద్రమోడీ స్టేడియంగా మార్చిన బీజేపీ తీరును కడిగేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అవకాశం వస్తే కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటోకు బదులు మోడీ ఫొటో పెడుతారేమోనని ఎద్దేవా చేశారు.

ఈ మధ్యకాలంలో బీజేపీ పాత పేర్లను తీసివేసి ప్రధాని నరేంద్రమోడీ పేరు పెట్టుకోవడంపై విమర్శలు వస్తున్నా.. బీజేపీ నేతలు తమ పంథా మార్చుకోవడం లేదు. ఇప్పటికీ ఎన్నో పేర్ల మార్పుపై విమర్శలు వస్తున్నా బీజేపీ తీరు మారడం లేదు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News