దెబ్బకు దిగివచ్చిన మంత్రి మల్లారెడ్డి.. ఎమ్మెల్యేలతో రాజీ

Update: 2022-12-20 09:30 GMT
బీఆర్ఎస్ లో అసమ్మతి సెగను చల్లార్చేందుకు అటు కేసీఆర్.. ఇటు మంత్రి మల్లారెడ్డి నడుం బిగించారు. ఎమ్మెల్యేల అసమ్మతి రాగంతో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దిగివచ్చాడు. తమది క్రమశిక్షణ గల పార్టీని ఇంటి సమస్యని త్వరలో పరిష్కరించుకుంటామని చెప్పాను. తాను ఎవరితోనూ విభేదాలు పెట్టుకునే రకం కాదన్నారు. మా మధ్య సమస్యలు లేవని.. తానే ఎమ్మెల్యేల ఇంటికి వెళతానని.. వారితో మాట్లాడుతానని తెలిపారు.

తాను గాంధేయవాదిని అని.. తమ ఇంటి సమస్య.. మీడియానే ఎక్కువగా చూపిస్తోందని మల్లారెడ్డి అన్నారు. పదవులు కేసీఆర్, కేటీఆర్ ఇస్తారని.. తాను కాదని తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యేలను అందరినీ తమ ఇంటికి ఆహ్వానిస్తానని మల్లారెడ్డి వివరించారు.

నిన్న హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు బరెస్ట్ అయ్యారు. ఏకంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టి మంత్రి మల్లారెడ్డి ఆధిపత్యాన్ని సహించమని తొలగించాలని తిరుగుబావుటా ఎగురవేశారు. మేడ్చల్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశం కావడం బీఆర్ఎస్ లో చర్చనీయాంశమైంది. ఇక అన్ని జిల్లాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా గుంభనంగా ఉన్నారని తెలుస్తోంది.

ఇన్నాళ్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ మాట జవదాటేవారుకాదు.. ఆయనంటే భయం, భక్తి ప్రదర్శించేవారు. కానీ కేసీఆర్ నియమించిన మంత్రికి వ్యతిరేకంగా బాహాటంగా మీడియా ముందుకు ఎక్కడం నిజంగానే కేసీఆర్ కు మింగుడుపడని విధంగా ఉంది.

ఈ వ్యవహారాన్ని తేలుస్తారా? అని కేసీఆర్ వద్దకు వెళితే అది వేరేలా ఉండేది. కానీ మీడియా ముఖంగా ఈ అసమ్మతి రాజేయడంతో ఇక బీఆర్ఎస్ లో కేసీఆర్ పై తిరుగుబాటుగానే చెప్పొచ్చు. ఇది అంతిమంగా మరింత మంది గళమెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది.

తమకు నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా.. ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయవద్దంటూ మంత్రి మల్లారెడ్డి కలెక్టర్ ను, అధికారులను ఆదేశించడంపై ఐదుగురు ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. దీంతో వీరిదెబ్బకు మల్లారెడ్డి దిగివచ్చాడు. అందరు ఎమ్మెల్యేలను కలిసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని.. అందరినీ కలుపుకొని పోతానన్నారు. మంత్రి వ్యవహారశైలిపై సీఎం వద్దకు వెళ్లేందుకు వీరు సిద్దమైనట్లు సమాచారం. మరి బీఆర్ఎస్ కప్పులో ఈ తుఫాన్ ఎల్లా చల్లారుతుందో చూడాలి. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News