ఈడీ, ఐటీ దాడులపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి

Update: 2022-11-24 08:02 GMT
ఐటీ, ఈడీ దాడులకు భయపడొద్దని సీఎం కేసీఆర్ ముందే చెప్పారని.. ఒక మంత్రిపై ఇంత దౌర్జన్యమా? అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. '30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నా.. ఇంజినీరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది నేనే అని గర్వంగా చెబుతా.. ఇంజినీరింగ్ వ్యవస్థ అంటే మల్లారెడ్డి గుర్తొచ్చేలా తీర్చిదిద్దాం.. అక్రమాలు, దౌర్జన్యాలు మాకు అలవాటు లేదు. ఇలాంటి దౌర్జన్యాలు నేనెప్పుడూ చూడలేదు.. వ్యాపారం కాదు సేవ చేస్తున్నాం..బీజేపీ కుట్రలకు భయపడేది లేదు' అని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.

తన పేరు ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలనే దాడుదుల చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తమనే కాదు.. సీఎం కేసీఆర్ ను కూడా ఏమీ చేయలేరని అన్నారు. ఈ విషయం కేసీఆర్ ముందే చెప్పారన్నారు.

ఇప్పటివరకు తమపై మూడు సార్లు ఐటీ దాడులు జరిగాయని.. కానీ ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.  'ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు. బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. నా సంస్థలు ఓపెన్ బుక్. కొడుకు, కోడలు ఆస్పత్రిలో ఉన్నారని చెప్పిన నన్ను విడిచిపెట్టలేదు. నా కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నారు. రూ.6 లక్షలు దొరికితే అక్కడే విడిచిపెట్టిపోయారు.. ఇప్పటి నుంచి విచారణకు రావాలని వేధిస్తారు' అంటూ మండిపడ్డారు.

ఎంబీబీఎస్ మేనేజ్ మెంట్ కోటా లేదు.. వివిధ కేటగిరిలతో అన్నీ కౌన్సిలింగ్ సీట్లే. అంతా ఆన్ లైన్ లోనే.. కౌన్సిలింగ్ జరుగుతోంది. మేనేజ్ మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్లు ఎలా వస్తాయి? వందల కోట్లు ఎలా వస్తాయి? మేం తీసుకుంటే డబ్బులు దొరకాలి కదా? ' అంటూ మల్లారెడ్డి ప్రశ్నలు సంధించారు.

ఇక తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని ఐటీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రాయితీలతో సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిర్ధేశించిన ఫీజు కంటే ఎక్కువ మొత్తాలు వసూలు చేసినట్టు గుర్తించారు. అదనంగా వసూలు చేసిన మొత్తాలను నగదు రూపంలో తీసుకున్నట్టు ఆధారాలు సేకరించినట్టు ఐటీ వర్గాలు తెలిపాయి.

అనధికారికంగా లెక్కల్లో చూపకుండా నగదు రూపంలో వసూలు చేసిన మొత్తాలను స్థిరాస్థి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రి కోసం వెచ్చించినట్టు పేర్కొన్నారు.  ఇక ఇప్పటివరకూ చేసిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News