నా చ‌ర్మంతో చెప్పులు కుట్టించినా జగన్‌ రుణం తీర్చుకోలేను: నారాయణస్వామి

Update: 2021-11-02 04:02 GMT
ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చర్మంతో జగన్‌ కు చెప్పులు కుట్టించినా ఆయన రుణం తీర్చుకోలేనిదంటూ భక్తిని చాటుకున్నారు. అందుకు కారణం కూడా చెప్పారు. ద‌ళితుల‌కు రాజ‌కీయంగా, ఆర్ధికంగా నిజ‌మైన స్వాతంత్రం సీఎం జ‌గ‌న్ పాల‌న‌లోనే వ‌చ్చిందన్నారు. జగన్ తనకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి ఓ చ‌రిత్ర సృష్టించారని ప్రశంసలు గుప్పించారు. వాణిజ్య పన్నుల శాఖను తన నుంచి తొలగించి ఎక్సైజ్ శాఖకే పరిమితం చేయటంపై కొందరు తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆయన ఆక్షేపించారు. జగన్ మానవత్వం ఉన్న మనిషి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దళితులను అభివృద్ధి చేస్తున్నాయని తెలిపారు. ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వ పాలనను దేశం మొత్తం ఆదర్శంగా తీసుకుంటుందన్నారు. వచ్చే ఏడాది నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయమని చెప్పానని, ఈ ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారని నారాయణస్వామి తెలిపారు. దళితులను చంద్రబాబులాగా జగన్ అవమానించారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు మానుకోవాలని నారాయణ స్వామి హితవు పలికారు. గతంలో కూడా భగవంతుడి స్వరూపుడే జగన్ అంటూ కొనియాడారు. అప్పుడు కూడా తన శరీరం ఒలిచి చెప్పుడు కుట్టించినా జగన్ రుణం తీసుకోలేనని వ్యాఖ్యానించారు.

నారాయణస్వామి శాఖల్లో కోతలు విధించారు. వాణిజ్య పన్నుల శాఖను నారాయణ స్వామి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాణిజ్య పన్నుల శాఖను ఆర్థిక మంత్రి బుగ్గనకు అప్పగించారు. ఎక్సైజ్ శాఖకే నారాయణస్వామిని పరిమితం చేశారు. వాస్తవానికి ఆయన దగ్గరున్నవి ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖలు. వాటిలో ఎక్సైజ్‌ది ఇప్పుడు అంతగా ప్రాముఖ్యత ఉన్న శాఖ కాదు. ఇప్పుడు మరో కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ నుంచి నారాయణస్వామి తీసేశారు. దీంతో ఆయన పేరుకే మంత్రిగా మిగిలిపోయారని అంటున్నారు.





Tags:    

Similar News