బడి మంత్రి గారు...పట్టించుకోండి సార్...?

Update: 2022-04-30 09:30 GMT
ఆయన బడి మంత్రి. ఇది అచ్చ తెలుగులో చెప్పుకునే మాట. ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఆర్భాటంగా ఆంగ్లంలో బాగుంటుంది. మన తెలుగులో అయితే ఆయన బడి మంత్రిగానే చెప్పుకోవడానికి బాగుంటారు. ఆయనే సీనియర్ మోస్ట్ నేత బొత్స సత్యనారాయణ. ఆయన సీనియరిటీకి బడి శాఖ ఇవ్వడమేంటి ఈ వయసులో ఆయన బడికి వెళ్లాలా. పాఠాలు చెప్పాలా అని కొన్ని రోజుల పాటు అనుచరులు తెగ మధనపడినా బొత్స సార్ కూడా కలత చెందినా మొత్తానికి ఆయన సర్దుకున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండవ సారి విద్యా శాఖ మీద సమీక్ష పెడితే దానికి హాజరయ్యారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ప్రతీ రోజూ టెన్త్ పరీక్షలు లీక్ అవుతున్నాయి. అలా అదే పనిగా జరిగిపోతోంది. దాని మీద మీడియా ప్రశ్నిస్తే అది పెద్ద విషయం కాదన్నట్లుగా మంత్రి గారు పెద్దగా రియాక్ట్ కాకపోవడం మీదనే సెటైర్లు పడుతున్నాయి.

టెన్త్ పరీక్షలకే ఇలా ఉంటే ఎనిమిది తొమ్మిది పరీక్ష పేపర్లు ముందు రోజు రాత్రే వాట్సప్ లో వచ్చేస్తునాయి. ఇది నిజంగా కొత్త ట్రెండ్. ఎపుడో ఎక్కడో ఒక పేపర్ లీక్ అవడం అంటే ఏమో అనుకోవచ్చు. ఈసారి తొమ్మిది, ఎనిమిది ప్రశ్న పత్రాలు మొత్తాం లీక్ అయిపోయాయి. మరి దాని మీద బాధ్యత కలిగిన మంత్రి గారు ఏమి ఎంక్వైరీ చేయించారో తెలియదు కానీ దాని కంటే ప్రెస్టేజ్ గా నిర్వహిస్తున్న టెన్త్ పరీక్షల పేపర్లు వరసగా మూడు రోజులూ లీక్ అయ్యాయి.

దీని మీద మంత్రి గారు లైట్ తీసుకున్నట్లే మాట్లాడమే విడ్డూరంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. పైగా పరీక్షలు మొదలైన తరువాత కదా లీక్ అవుతోంది అని అంటున్నారు. మరి దాన్ని అరికట్టలేరా అంటే ఇంత పెద్ద వ్యవస్థ,  పైగా టెక్నాలజీ పెరిగింది అని బొత్స ఏవేమో మాట్లాడుతున్నారు.

పోనీ ఎవరి మీద అయినా అనుమానమా అంటే అబ్బే తెలియని దాని గురించి ఎందుకు  అనాలి అంటున్నారు. మొత్తానికి చూస్తే మాత్రం ఎలిమెంటరీ నుంచి టెన్త్ దాకా ఈసారి పేపర్లు లీక్ అవడమే ప్రత్యేకత. సీనియర్ మోస్ట్ నేత మంత్రిగా ఉన్న శాఖలో ఇలా వరసబెట్టి జరుగుతున్నా పట్టించుకోనట్లుగా ఉండడమే విశేషం.

అంతే కాదు, ఎల్లో మీడియా రాతలు అంటున్నారు. పరీక్ష పేపర్ లీక్ అయితేనే కదా అక్కడ రాతలు కనిపించేది. మరి అసలు విషయం తేల్చకుండా ఎవరో రాశారని బాధపడడం ఎందుకు. అసలు ఇంతకీ బడి శాఖ మీద మంత్రి గారికి ఆసక్తి ఉందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా బడి గుడి పవిత్రమైనవి. ఆ శాఖలను చూసే వారు కూడా వాటిని అలాగే భావించాలి.

రేపటి పౌరులను తేల్చే కీలకమైన ఈ శాఖల విషయంలో నిర్లక్ష్యం తగదు. అలా కనుక వ్యవహరిస్తే విద్యార్ధుల భవితవ్యమే ఇబ్బందులో పడుతుంది. మొత్తానికి లీక్ వీరులను పట్టుకుని చర్యలు తీసుకుంటేనే మిగిలిన  టెన్త్ పరీక్షలు అయినా సవ్యంగా సాఫీగా జరుగుతాయని అంటున్నారు. ఏమంటారు బొత్స సార్.
Tags:    

Similar News