ఫోన్లే నిందితులను పట్టించాయా ?

Update: 2022-05-11 04:29 GMT
పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఇప్పటివరకు 60 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే విషయమై విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో అరెస్టు చేసిన నిందితుల విషయంలో మొబైల్ ఫోన్లు కీలక పాత్ర పోషించినట్లుగా చెప్పారు. అనుమానితుల ఫోన్లన్నింటినీ ట్యాపింగ్ చేయటం ద్వారా కీలకమైన ఆధారాలను సేకరించామన్నారు.

లీకేజీ వ్యవహారమంతా నారాయణ విద్యాసంస్థల ద్వారానే జరిగినట్లు ఫోన్ల ట్యాపింగ్ ద్వారా ఆధారాలను సేకరించిన తర్వాతే వాళ్ళందరినీ అరెస్టు చేసినట్లు చెప్పారు.

అంటే లీకేజీ వ్యవహారం బయటపడగానే అనుమానితుల ఫోన్లను ట్యాపింగ్ చేయటం ద్వారా వాళ్ళ మాటలను వినటం, వాళ్ళ వ్యూహాలను రికార్డు చేయటం లాంటివి నిర్ధారణ చేసుకున్న తర్వాతే అరెస్టు చేశారు. ఇక నారాయణ విషయానికి వస్తే గడచిన నాలుగు రోజులుగా మాజీ మంత్రి కోసం పోలీసులు చాలాచోట్ల వెతకాల్సొచ్చింది.

ఈయన రోజుకో ఇంటిని మార్చటం వల్ల మాజీ మంత్రి ఏ ఇంట్లో ఉన్నారో కనుక్కోవడం పోలీసులకు బాగా కష్టమయ్యిందని సమాచారం. కూకట్పల్లి, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి లాంటి  ప్రాంతాల్లో నారాయణకు ఇళ్ళున్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే చివరకు నారాయణ ఉనికిని మొబైల్ ఫోనే పట్టించిందట. మొబైల్ కూడా రోజులో చాలాసేపు మొబైల్ ను స్విచ్చాఫ్ లోనే ఉంచేవారట. అలాంటిది తన అవసరాల కోసం మాత్రమే మొబైల్ ను ఆన్ చేసినపుడు సెల్ టవర్ సిగ్నల్ ద్వారా చివరకు ఆయన ఎక్కడున్నారనేది కనుక్కున్నారు.

దాంతో వెంటనే సదరు సిగ్నల్ లొకేషన్ కు వెళ్ళి, అడ్రస్ పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. అయితే హోలు మొత్తం మీద ఉన్న అనుమానం ఏమిటంటే అసలు ఫోన్ ట్యాపింగ్ కు పోలీసులు అవసరమైన అనుమతులు తీసుకున్నారా ? నారాయణతో పాటు ఇతర నిందితుల అరెస్టుకు మొబైల్ ట్యాపింగే కీలకమైన ఆధారం కావటం ద్వారా శాస్త్రీయమైన ఆధారాలను పోలీసులు సేకరించినట్లు అర్ధమవుతోంది. మరి చివరకు ఈ కేసు కోర్టు విచారణలో ఏమవుతుందో చూడాల్సిందే.
Tags:    

Similar News