పవన్ దమ్ము తెలుసుకోవాలంటే జగన్ ను పోటీ చేయమనండి రోజా?

Update: 2022-09-20 04:30 GMT
వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడే విషయంలో వైసీపీ నేతల తీరు రోటీన్ కు కాస్త భిన్నమని చెప్పాలి. తాము టార్గెట్ చేయాలనుకునే వారిని మాటలతో ఏదో రకంగా అనేయటం.. వారిని కించపరిచేలా మాట్లాడే విషయంలో వైసీపీ నేతలు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారా? అన్న సందేహం కలుగక మానదు. ఇందుకు ఏపీ మంత్రి ఆర్కే రోజా మాటలే నిదర్శనం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోటి నుంచి అనవసరమైన మాట ఒక్కటి కూడా రాకుండానే.. అదే పనిగా ఆయనపై విరుచుకుపడే వైసీపీ నేతలకు తగ్గట్లే రోజా పస లేని వాదన ఒకటి తీసుకొచ్చారు.

పవన్ కల్యాణ్ కు దమ్ముంటే.. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలని కోరారు. కొన్నిసార్లు తీవ్రమైన ఆగ్రహంతో విచక్షణ కోల్పోతారని చెబుతుంటారు. ఈ విషయాన్ని రోజా త్వరగా తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన దమ్మును చూపించటం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పోటీ చేయాలని కోరటం తెలిసిందే.

తన దమ్ము ఏమిటో చూపిస్తానని పవన్ ఎప్పుడు మాట్లాడలేదు. నిజానికి పవన్ దమ్ము ఏమిటో చూడాలని తపిస్తున్నది రోజా. ఎందుకంటే.. ఆమెకు పవన్ దమ్ము ఏమిటో సరిగా తెలియకపోవటమే. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓటర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవటం తెలిసిందే.

అభిమానంతో తనకు ఓటు వేసే వారు వేస్తారు. లేకుంటే వేయరు. అంతేకానీ.. ఓట్లను కొనుక్కోవటం ఏమిటి? అన్న మాటకు కట్టుబడిన పవన్ కల్యాణ్ కు.. ఓట్ల కోసం కిందా మీదా పడుతూ కోట్లాది రూపాయిలు ఖర్చు చేసే వైసీపీ నేతలకు అసలు ఏమైనా పోలికా? అన్నది ప్రశ్న.  

ఎన్నికల్లో ఓట్లను కొనేందుకు పైసా ఖర్చు చేయని దమ్ము పవన్ ది అయితే.. తనతో సహా తమ పార్టీకి చెందిన వారికి అలాంటి దమ్ము ఉందా? అన్నది చెక్ చేసుకోవాల్సింది రోజానే.  అయినా.. పవన్ దమ్ము తెలుసుకోవాలన్న కోరిక రోజాకు ఉంటే.. దానికి ఆమె చేయాల్సింది.. పవన్ ను జగన్ మీద పోటీ చేయటం కాదు. తమ అధినేత.. ఆరాధ్య నాయకుడు జగన్ ను పవన్ మీద పోటీ చేయాలని కోరాలి.

అంతేకాదు.. పవన్ మాదిరి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ.. ఎన్నికల వేళ.. ఓటర్లకు రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఉండటంతో పాటు.. క్వార్టర్ సీసా కూడా ఇవ్వకుండా ఎన్నికల బరిలో దిగితే.. ఎవరి దమ్ము ఏమిటో అర్థమవుతుందంటున్నారు. అందుకే అనేది.. తొందరపాటుతో దమ్ము గురించి మాట్లాడితే.. లేనిపోని చిక్కుల్లో చిక్కుకోవాల్సి వస్తుందన్న విషయం రోజా మాష్టారు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని తెలుసుకోవాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News