తిరుమలలో మంత్రి రోజా డ్రైవర్ నిర్వాకం!

Update: 2022-06-11 09:46 GMT
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, యువజన, క్రీడా శాఖల మంత్రి ఆర్కే రోజా ఎస్కార్ట్ డ్రైవర్ నిబంధనల హద్దు మీరాడు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మంత్రి రోజా వచ్చారు. అలాగే ఆమెతో పాటు ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ కూడా దర్శనానికి వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉన్నా అతడు టీషర్టు, జీన్సు ధరించి స్వామి వారి దర్శనానికి రావడం కలకలం రేపింది.

తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం.. స్వామివారి దర్శనానికి వచ్చే వారు ఎవరైనా సరే సంప్రదాయ దుస్తులను ధరించి రావడం ఆనవాయితీ. పురుషులు అయితే లుంగీ లేదా పంచె, మహిళలు అయితే పంజాబీ డ్రెస్ లేదా చీర.. ఇలా సంప్రదాయ దుస్తుల్లోనే దర్శనానికి రావాల్సి ఉంటుంది.

ఇందులో ఎంత పెద్ద హోదాలో ఉన్నవారికైనా మినహాయింపు లేదు. అయితే మంత్రి ఆర్కే రోజా ఎస్కార్టు వాహనం డ్రైవర్ ఈ నిబంధనలను ఏమీ పట్టించుకోకుండా జీన్సు, టీ షర్టు ధరించి దర్శనానికి వచ్చేయడం వివాదాస్పదమైంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు బయోమెట్రిక్ వేయడానికి వెళ్లే దారి గుండా ఆలయం లోపలకి మంత్రి రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ ప్రవేశించాడు. దీన్ని గమనించిన టీటీడీ ఉద్యోగులు అతడిని ఆలయం పడికావలి నుంచే వెనక్కి పంపారు. సంప్రదాయ దుస్తులతో రావాలని అతడికి సూచించారు.

ఆ తర్వాత ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన మంత్రి రోజా ఒక టీవీ చానెల్ అత్యుత్సాహం తప్ప ఇందులో ఏమీ లేదన్నారు. తన డ్రైవర్ ఏ తప్పూ చేయలేదని చెప్పారు. తనతో తన డ్రైవర్ మహాద్వారం గుండా వచ్చాడని ఎల్లో మీడియా చానెళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు. మహాద్వారం నుంచి తాను మాత్రమే వెళ్లానని వివరణ ఇచ్చారు.

కాగా ప్రముఖ నటి నయనతార, తన భర్త విఘ్నేష్ శివన్ తో కలసి వచ్చి చెప్పులతో తిరుమల మాడ వీధుల్లో తిరగడంపై జూన్ 10న తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె అలా తిరుగుతున్నా అధికారులు ఎవరూ ఆమెను అడ్డుకోలేదని, అభ్యంతర పెట్టలేదని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇంతలోనే మళ్లీ మంత్రి రోజా ఎస్కార్టు డ్రైవర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
Tags:    

Similar News