మంత్రి గారికి ఒక్క చాన్స్ ఇస్తే...?

Update: 2022-08-22 01:30 GMT
ఆయన పూర్వాశ్రమంలో డాక్టర్. అయితే లక్ కలసి వచ్చి ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి జగన్ వేవ్ లో పలాసా వంటి టీడీపీ కంచుకోటను బద్ధలు కొట్టి ఎమ్మెల్యే అయిపోయారు. పలాసాలో బీసీ నేత సర్దార్ గౌతు లచ్చన ఫ్యామిలీకి గట్టి పట్టుంది. అలాంటి చోట కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సీదరి అప్పలరాజు నిలదొక్కుకోవడం అంటే అది గ్రేటే. ఇక అప్పలరాజుకు ఒక ఏడాది తరువాత మంత్రి పదవి కూడా దక్కింది. ఇక రెండవ సారి విస్తరణలో ఆయనను కంటిన్యూ చేశారు.

దాంతో ఆయన నాలుగేళ్ళ మంత్రిగా 2024 దాకా ఉండనున్నారు. ఇలా రాజకీయంగా ఆయనకు అవకాశాలు దక్కుతున్నప్పటికీ ఆయన దూకుడుతో తన గోల్డెన్ చాన్స్ లను పాడుచేసుకుంటున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయనకు ప్రత్యర్ధి బలమైన వారే. పైగా బీసీలలో పేరున్న గౌతు కుటుంబం. అయితే గౌతు లచ్చన్న మూడవ తరం కాబట్టి కొంత తేడా కనిపిస్తోంది. గౌరు శ్యామ సుందర శివాజీ కూతురు శిరీష  స్పీడ్ చేస్తున్నా తండ్రి కంటే ముందుకు వెళ్లలేకపోతున్నారు. పైగా పార్టీపరంగా ఇబ్బందులు ఉన్నాయి.

మరో వైపు గౌతు ఫ్యామిలీకి అల్లుడు వల్ల 2014 నుంచి 2019 టైమ్ లో ఇబ్బంది వచ్చింది. ఆయన డీఫ్యాక్టో ఎమ్మెల్యేగా అక్కడ వ్యవహరించేవారు అని చెబుతారు. అయితే సీదరి అప్పలరాజుని గెలిపించడం ద్వారా జనాలు మార్పు కోరుకున్నారు. దాన్ని చూసుకుని తన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాల్సిన మంత్రి గారు తొందరపడుతున్నారా అన్న చర్చ వస్తోంది. ఆయన రాజకీయ ప్రత్యర్ధుల మీద అధికార బలం, పోలీస్ బలాన్ని ఉపయోగించాలని చూడడం వల్ల ప్రస్తుతానికి బాగానే ఉన్న భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు.

ఇక ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ అంటూ మంత్రి గారు అధికారులను పురమాయించి టీడీపీ వార్డులనే టార్గెట్ చేయడం వెనక ఫక్తు రాజకీయమే ఉంది అంటున్నారు. ఆ మీదట టీడీపీ మహిళా నేత గౌతు శిరీష మంత్రి మీద అనుచితంగా మాట్లాడారు అంటూ ఏకంగా టీడీపీ ఆఫీస్ మీదనే దాడి చేయాలని ఆలోచించడం కూడా పోరపాటు వ్యూహమే అంటున్నారు. అక్కడ ఉన్నది గౌతు ఫ్యామిలీ, పైగా మహిళా నేత ప్రత్యర్ధి, దానిని మించి ఏకంగా ఒక పార్టీ ఆఫీస్ మీద దాడి చేయడం అన్నది ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. మరి అలాంటివి చేస్తే ఎదుటి పార్టీకి సానుభూతిని పెంచే విధంగా ఉండవా అని అంటున్నారు.

ఇక పలాసాలో ఒక వార్డులో జరిగిన ఇష్యూ ఇపుడు స్టేట్ పాలిటిక్స్ దాకా పాకింది అంటే మంత్రి గారు తన వ్యూహాలను గురించి ఆలోచించుకోవాల్సిందే అంటున్నారు. అలాగే మంత్రి సహా వైసీపీ నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు అన్నది కూడా ఎపుడూ జరగని వ్యవహారమే. ఈ విధంగా ఢీ అంటే ఢీ అని వేడి  రాజకీయం పలాసాలో పెంచేలా అటూ ఇటూ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఈ రకంగా మాటల దాడులు, ఎదురు దాడులు చేస్తూ పోతే తన పట్టు నిలిస్తుంది అని మంత్రి గారు ఎలా అనుకుంటున్నారు అన్నదే.

ఇప్పటికైనా మంత్రి కానీ ఆయన అనుచరులు కానీ టీడీపీ ట్రాప్ లో పడకుండా తమ సొంత వ్యూహాలకు పదును పెట్టి వైసీపీ పటిష్టానికి బాటలు వేసుకుంటేనే వచ్చే ఎన్నికల్లో అప్పలరాజు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే మంత్రి అతని అనుచరుల వల్లనే మూడేళ్ళ వ్యవధిలో పలాసాలో టీడీపీ గ్రాఫ్ పెరిగింది అంటున్నారు.
Tags:    

Similar News