సినీన‌టులు టెన్ష‌న్ ప‌డొద్దంటున్న త‌ల‌సాని

Update: 2017-07-28 12:26 GMT

డ్రగ్స్ వ్యవహారంలో సినీ నటీనటులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఇవాళ మంత్రి తలసాని ఈ విషయమై మాట్లాడుతూ గడిచిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్లే నగరంలో డ్రగ్స్ మహమ్మారి విస్తరించిందన్నారు. మత్తుపదార్థాల కేసుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి విచారణ జరిపిస్తుందన్నారు.ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ఆదేశాల మేరకు హైదరాబాద్‌ ను డ్రగ్స్ ర‌హిత నగరంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ఆయ‌న వివ‌రించారు.

సినీ పరిశ్రమకు చెందిన ఎంతో మంది నటీనటులు ఎన్నో ఏళ్ల నుంచి హైదరాబాద్‌ లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటున్నారని..వారిలో కొంతమంది డ్రగ్స్ కేసులో ఉండటం వల్ల మొత్తం పరిశ్రమనే తప్పుపట్టడం సరికాదని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌ అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని తలసాని స్పష్టం చేశారు. విద్యార్థులు డ్రగ్స్ వైపు చూడకుండా వారి భవిష్యత్‌ ను కాపాడేందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నట్లు వెల్లడించారు.

మ‌రోవైపు డ్రగ్స్ మాఫియాపై దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నదని, సినిమా పరిశ్రమలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు స్పష్టం చేశారు. లభించిన ఆధారాలతో విచారణ కొనసాగిస్తున్నామన్నారు. తప్పుచేసినవారిపై చర్యలు తప్పవని, ఇందులో ఒకవేళ తన పిల్లలు ఉన్నా విచారణకు పంపిస్తానని చెప్పారు. దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామన్నారు. ఇప్పటి వరకు 3000 యూనిట్ల ఎల్‌ ఎస్‌ డీని - 45 గ్రాముల కొకైన్ - వేరే ఇతర నార్కోటిక్ - సైకోట్రోఫిక్ పదార్థాలను రికవరీ చేశామని వివరించారు. సినిమా పరిశ్రమలోని 12 మందికి - 11 బార్లు - పబ్‌ లకు - 26 స్కూళ్లకు - 27 కాలేజీలకు - 13 ఐటీ కంపెనీలకు నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. పిల్లలను సక్రమమార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు.
Tags:    

Similar News