ఎంపీటీసీపై మంత్రి విశ్వరూప్ కొడుకు బూతు పంచాంగం ఇదే!?

Update: 2022-06-02 12:30 GMT
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు బూతులతో రెచ్చిపోయాడు. ఓ ఎంపీటీసీపై ఫోనులో దారుణ బూతులతో చెలరేగిపోయాడు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో, యూట్యూబులో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకెళ్తే.. అమలాపురం ఎమ్మెల్యే, మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీటీసీ అడపా సత్తిబాబుపై బూతులతో రెచ్చిపోయాడు. చెప్పలేని.. రాయలేని భాషలో ఎంపీటీసీపై బూతుల దండకం ఎత్తుకున్నాడు. ఎంపీటీసీ ఎంతో మర్యాదగా వారిస్తున్నా వినకుండా అసభ్య, అభ్యంతకర వ్యాఖ్యలతో దూషణలకు పాల్పడ్డాడు.

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ పరిరక్షణ సమితి మే 24న అమలాపురం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ముట్టడిలో సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు చేరడంతో తీవ్ర అల్లర్లు, విధ్వంసం చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులు మంత్రి పినిపె విశ్వరూప్ కు చెందిన రెండు ఇళ్లు (వీటిలో ఒకదానిలో ఆయన అద్దెకు ఉంటున్నారు), అలాగే ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ కు చెందిన మరో ఇంటిని తగులబెట్టారు. అంతేకాకుండా పలు ప్రైవేటు, ఆర్టీసీ బస్సులను దహనం చేశారు. రాళ్లు విసరడంతో 30 మందికిపైగా పోలీసులకు గాయాలయ్యాయి.

కాగా విశ్వరూప్ ఇంటిని తగులబెట్టినప్పుడు ఆయన భార్య, కుమారుడు అందులో లేరు. పోలీసులు లాఠీచార్జ్, గాలిలోకి కాల్పులు జరిపితే కానీ ఆందోళనకారులు శాంతించలేదు. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇప్పటికీ అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అలాగే ఇంటర్నెట్ పై విధించిన నిషేధం కూడా కొనసాగుతోంది. కాగా ఈ విధ్వంసంలో మంత్రి విశ్వరూప్ అనుచరులు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తన అనుచరులు కూడా ఈ విధ్వంసంలో ఉన్నారని విశ్వరూప్ అన్నట్టు మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

ఈ నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ కుమారుడు వైఎస్సార్సీపీకే చెందిన ఎంపీటీసీపై బూతుల దండకం ఎత్తుకున్నాడు. నిన్ను, నీ భార్యను ఇంటికొచ్చి తగలేస్తానని హెచ్చరించాడు. దమ్ముంటే ఇప్పుడు రావాలని తన ప్రతాపం ఏమిటో చూపిస్తానని హెచ్చరించాడు. తన తండ్రి పాములాంటివాడికి పాలు పోశాడని.. నీలాంటి వాళ్లను చేరదీశాడని మండిపడ్డాడు. నా ఇల్లు అంటించినందుకు నిన్ను చంపుతానంటూ ఎంపీటీసీపై మంత్రి కొడుకు బెదిరింపులకు దిగాడు.

కాగా అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి అడపా సత్తిబాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లతో తనకు సంబంధం లేకపోయినా మరో వర్గం ఈ కేసులో తనను ఇరికించారంటూ ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మంత్రి కొడుకు బూతులు, బెదిరింపుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Full View

Tags:    

Similar News