మంత్రి వ‌ర్సెస్ మాజీ మంత్రి.. హీటెక్కిన నెల్లూరు పాలిటిక్స్‌

Update: 2022-04-15 08:01 GMT
నెల్లూరు లో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజా మాజీ మంత్రి అనిల్‌ కుమార్ యాద‌వ్‌ కు, ప్ర‌స్తుతం మంత్రి అయిన కాకాణి గోవ‌ర్ధ‌న్‌ రెడ్డికి మ‌ధ్య వివాదాలు రొడ్డెక్కాయి. ఇప్ప‌టికే అనిల్‌.. మంత్రిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. త‌ను మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎంత‌గా గౌర‌వించారో.. అంత‌కు రెండింత‌ల గౌర‌వం తాను ఇచ్చేస్తాన‌ని.. వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మంత్రి కాకాణి ఈ నెల 17న జిల్లాకు రానున్నారు. ఈ క్రమంలో  కాకాణికి స్వాగతం పలికేందుకు అనుచరులు, అభిమానులు భారీ ఏర్పాట్లు చేశారు.

అయితే అదే సమయంలో నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మాజీ మంత్రి అనిల్ కుమార్ భారీ సభ నిర్వహించనున్నారు. దీంతో కాకాణి ర్యాలీ ట్రంకురోడ్డులోకి రాకూడదని, వస్తే ఏదైనా జరగొచ్చని పోలీ సులకి అనిల్ సూచించారు. 17న మాజీ మంత్రి అనిల్ వర్గీయులు తమ బలప్రదర్శనకు భారీ సన్నాహాలు చేపట్టారు. మ‌రోవైపు.. కోర్టులో జ‌రిగిన చోరీపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా కాకాణిని దెబ్బతీసేందుకే చోరీ అంటూ అనుచరులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే కాకాణి కేసులో ఆధారాలు అపహారించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏం జరిగింది?

నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో బుధవారం రాత్రి చోరీ జరిగింది.  గుర్తుతెలియని వ్యక్తులు కొన్ని కీలక రికార్డులను.. సీజ్‌ చేసిన నాలుగు మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌ టాప్‌ ను ఎత్తుకెళ్లిపోయారు. వాటిలో కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అవి మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పై టీడీపీ సీనియర్‌ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్‌ రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా గుర్తించారు. దీంతో ఈ దొంగతనం పెద్ద చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి సోమిరెడ్డికి విదేశాల్లో రూ.వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి 2017 డిసెంబరులో ఆరోపించారు.

అయితే కాకాణి నకిలీ పత్రాలు సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్‌ స్టేషన్‌ లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. కాకాణి విడుదల చేసినవి నకిలీ పత్రాలుగా ధ్రువీకరించి చార్జిషీటు దాఖలుచేశారు. ఆయన్ను ఏ-1 నిందితుడిగా పేర్కొన్నారు. నకిలీ పత్రాలు సృష్టించిన పసుపులేటి చిరంజీవి అలియాస్‌ మణిమోహన్‌ (ఏ-2), మరో ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఇది నెల్లూరు నాలుగో ఏడీఎం కోర్టులో విచారణ దశలో ఉంది.

బుధవారం రాత్రి ఈ కోర్టులో దొంగలు పడ్డారు. కొన్ని డాక్యుమెంట్లు, ల్యాప్‌ టాప్‌, సాక్ష్యాధారాలుగా సీజ్‌ చేసి భద్రపరచి ఉన్న నాలుగు మొబైల్‌ ఫోన్లను దోచుకెళ్లారు. చోరీ జరిగిన విషయాన్ని కోర్టు సిబ్బంది జిల్లా న్యాయమూర్తి యామినికి తెలియజేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. ప్రాంగణంలో చిందరవందర గా పడేసి ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

వాటిలో కాకాణిపై సోమిరెడ్డి పెట్టిన కేసుకు సంబంధించిన కొన్ని పత్రాలు, ఏ-2 నిందితుడి నకిలీ పాస్‌పోర్టు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి నెల్లూరు వన్‌ టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఇదంతా `ఎవ‌రో` కావాల‌ని చేశార‌ని కాకాణి వ‌ర్గం చెబుతోంది. ఈ నేప‌థ్యంలో నెల్లూరులో గ‌తంలో లేని విధంగా టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.
Tags:    

Similar News