కర్నూలులో ప్లాప్ షోగా మంత్రుల బస్సు యాత్ర

Update: 2022-05-30 05:30 GMT
తమ ‘సింహం’ లేకుండానే నిర్వహిస్తున్న సభలకే ప్రజలు పోటెత్తుతున్నారని.. అలాంటిది తమ సింహం సీన్లోకి వస్తే పరిస్థితి మరెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ఇటీవల ఏపీ అధికారపక్ష  నేతలు చేసిన వ్యాఖ్యల్లో పస లేదన్న విషయం తాజాగా కర్నూలులో నిర్వహించిన సామాజిక న్యాయ భేరి పేరుతో నిర్వహించిన మంత్రుల బస్సుయాత్ర షాకిచ్చింది. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు నాలుగు రోజుల పాటు సాగిన మంత్రులు బస్సు యాత్ర చివరి రోజున కర్నూలు.. అనంతపురంలో సభల్ని నిర్వహించారు. కర్నూలులో నిర్వహించిన సభ పూర్తిగా ఫెయిల్ కావటమే కాదు.. అధికారపక్ష నేతలకు దిమ్మ తిరిగే షాకిచ్చింది.

కర్నూలులో ఏర్పాటు చేసిన సభకు ప్రజలు రాకపోవటం.. వచ్చిన వారు చాలా కొద్ది మందే ఉండటం.. భారీగా తెప్పించిన కుర్చీలు నిండటం తర్వాత.. తెచ్చిన కుర్చీలు వేయాల్సిన అవసరం లేని పరిస్థితి చోటు చేసుకోవటంతో బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రులకు నోట మాట రాని పరిస్థితి. కర్నూలు సభ విఫలంపై అధినేత అడిగే ప్రశ్నలకు తామేం సమాధానం చెప్పాల్సిన వస్తుందన్నది ఇప్పుడు వారికి కొత్త టెన్షన్ గా మారింది. అయితే.. సభ ఫెయిల్ కావటానికి కారణాలు లేకపోలేదంటున్నారు.

మే చివరిలో.. అది కూడా మండే ఎండలో ఉదయం పదకొండు గంటలకు జరుగుతుందని చెప్పిన సభ.. మధ్యాహ్నం ఒంటి గంటలకు మంత్రులు ప్రయాణిస్తున్న సభ రావటంతో.. అప్పటివరకు వెయిట్ చేయలేని ప్రజలు వెళ్లిపోయారు. దీనికి తోడు.. సభకు హాజరయ్యే వారికి అవసరమైన మంచినీళ్లు.. మజ్జిగ పాకెట్లను సరఫరా చేసే విషయంలోనూ జరిగిన పొరపాట్లు కూడా సభ ఫెయిల్ కావటానికి కారణమైంది.

మంత్రులు ప్రసంగించే సమయంలో మజ్జిగ పాకెట్లను ఒకవైపు ఇస్తుండటంతో.. మంత్రులు చెప్పే మాటల్ని వదిలేసి.. మజ్జిగ పాకెట్ల కోసం సభికులు పరుగులు తీసిన వైనంతో.. సభ మరింత పేలవంగా మారిన పరిస్థితి. గంటల తరబడి వెయిట్ చేయాల్సి రావటం.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సభకు తీసుకొచ్చిన మహిళలు తాము ఉండలేమని చెప్పేసి వెళ్లిపోయిన పరిస్థితి. దీంతో.. వారికి వేసిన కుర్చీలు భారీ సంఖ్యలో ఖాళీగా దర్శనమిచ్చాయి.

అంతేకాదు.. సభ కోసం తెచ్చిన కుర్చీల పెద్ద ఎత్తున పక్కన ఉంచారే తప్పించి వాటిని వేసే పరిస్థితి కూడా రాలేదు. దీంతో.. తమ బస్సు యాత్ర సూపర్ డూపర్ హిట్ అయ్యిందని చంకలు గుద్దుకుంటున్న వైసీపీ నేతలకు.. కర్నూలు సభ ప్లాప్ షోగా ఎందుకు మారిందన్న దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఏమైనా.. చివరి రోజున అనుకోని రీతిలో షాక్ తగలటంతో బస్సు యాత్రలోని మంత్రులు డీలా పడిన పరిస్థితి.
Tags:    

Similar News