పిల్లల ఆ తప్పులకు పెద్దలకు శిక్ష పక్కానంట

Update: 2016-03-16 04:43 GMT
ఎవరి తప్పులకు వారికే బాధ్యత అన్నది ఇప్పటివరకూ తెలిసిన న్యాయం. ఇకపై అందుకు కొత్త రూల్ కలవనుంది. పిల్లలు చేసే తప్పులకు బాధ్యత అయిన పెద్దలు సైతం చట్టం ముందు దోషులుగా నిలబడి.. బాధ్యత వహించటమే కాదు.. శిక్షల బాధను కూడా అనుభవించాల్సి రానుంది. ఇందుకు తగ్గట్లే తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తున్నారు. రోడ్డుప్రమాదాలకు చెక్ చెప్పే ప్రయత్నంలో భాగంగా వాహన వినియోగానికి సంబంధించిన కఠినంగా వ్యవహరిస్తున్న తెలంగాణ పోలీసులు.. మరో చక్కటి నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు మారాం చేస్తున్నారని.. వారి మీద ప్రేమతో పిల్లలకు తమ వాహనాల్ని ఇవ్వటం తరచూ చూస్తుంటాం. కానీ.. అవగాహన లేని వారిడ్రైవింగ్ కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి.

ప్రమాదాలు జరిగినా.. జరగకున్నా.. పిల్లలకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవటమే కాదు.. వారికి శిక్షలు కూడా విధిస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పోలీసులకు దొరికితే.. వారిని జువైనల్ హోమ్ కి తరలించటమే కాదు.. ఆ వాహనాన్ని ఇచ్చిన యజమానులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. తాజాగా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడిన ఇద్దరు లారీ డ్రైవర్లను పోలీసులు కోర్టుకు హాజరుపర్చగా.. వారిద్దరికి వారం రోజుల జైలుశిక్షను విధించారు. అంతేకాదు.. ఆ లారీ యజమానులకు వారం పాటు జైలుశిక్షను విధించింది. సో..పిల్లలు ముద్దుగా అడిగారని (చట్టబద్ధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా) వెనుకాముందు చూడకుండా వాహనాలు చేతికి ఇచ్చేస్తే.. తల్లిదండ్రుల్లో (వాహనం తల్లి.. తండ్రిలో ఎవరి పేరు మీద ఉంటే వారికి) బాధ్యులకు జైలుశిక్ష పక్కా అంటున్నారు. సో.. పారాహుషార్. 
Tags:    

Similar News