కేసీఆర్ కు షాకిచ్చేలా బీటీ ఎమ్మెల్యే వ్యాఖ్య‌లు

Update: 2018-03-22 09:59 GMT
తెలంగాణ అసెంబ్లీలో ఆస‌క్తిక‌ర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ రాసుకున్న స్క్రీన్ ప్లేకు ఏ మాత్రం తేడా రాకుండా  సాగే స‌మావేశాల‌కు భిన్నంగా ఈ రోజు కాస్తంత సంచ‌ల‌నాలు చోటు చేసుకోవటం విశేషం. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌ట్టారు కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరిన బంగారు తెలంగాణ ఎమ్మెల్యేలు (బీటీ బ్యాచ్‌) కొంద‌రు. త‌మ‌ను చిన్న చూపు చూస్తున్నారంటూ.. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోని స‌మ‌స్య‌ల్ని ఏక‌రువు పెట్టారు.

పార్టీ మారిన త‌మ ప‌ట్ల చుల‌క‌న‌గా చూడ‌టం వ‌ల్లే త‌మ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని బీటీ రోడ్ల పున‌రుద్ధ‌ర‌ణ స‌రిగా జ‌ర‌గ‌టం లేద‌న్నారు. హ‌స్తం పార్టీ గుర్తుపై విజ‌యం సాధించి.. అనంత‌రం టీఆర్ ఎస్ లో చేరిన‌ మిర్యాల‌గూడ ఎమ్మెల్యే భాస్క‌ర్ రావు మాట్లాడుతూ.. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో బీటీ రోడ్ల పున‌రుద్ద‌ర‌ణ జ‌ర‌గ‌టం లేద‌న్నారు. ఆయ‌న బాట‌లోనే న‌డిచిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మాట్లాడుతూ.. ప‌దేళ్లుగా త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో బీటీ రోడ్ల పున‌రుద్ధ‌ర‌ణ జ‌ర‌గ‌టం లేద‌ని.. జ‌రిగిన‌ట్లు నిరూపిస్తే త‌న ముక్కును నేల‌కు రాస్తాన‌న్నారు.

ఇలా వ‌రుస పెట్టి ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీటీ రోడ్లు లేవంటూ చేసిన వ్యాఖ్య‌లు అధికార‌పార్టీలో క‌ల‌క‌లం రేపాయి. వ‌ర్ద‌న్న‌పేట ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్ సైతం త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్లు స‌రిగా లేవ‌న్నారు. దీంతో క‌లుగ‌జేసుకున్న స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారి.. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ స‌మ‌స్య ఉంద‌న్నారు.

అనంత‌రం స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు మంత్రి జూప‌ల్లి స‌మాధానం ఇస్తార‌న్నారు. అధికార‌పార్టీలో ఇమ‌డ‌లేక బీటీ బ్యాచ్ ఇలా మాట్లాడుతుందా?  లేక‌.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టికెట్లు ల‌భించే అవ‌కాశం లేని వారంతా మాతృపార్టీలోకి వెళ్లే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారా? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బీటీ ఎమ్మెల్యేల నిర‌స‌న అధికార‌ప‌క్షంలో క‌ల‌క‌లాన్ని రేపింది.
Tags:    

Similar News