పోలండ్ పై క్షిపణి దాడి.. అత్యవసరంగా సమావేశమైన నాటో దేశాలు-అమెరికా

Update: 2022-11-16 10:30 GMT
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇన్ని నెలలుగా సాగుతున్న యుద్ధంలోకి ఇప్పుడు 'నాటో' లోని యూరప్ దేశాలు-అమెరికా దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఎందుకంటే తాజాగా ఉక్రెయిన్ పక్కనున్న పోలండ్ దేశంలోకి ఒక క్షిపణి దూసుకెళ్లింది. ఓ గ్రామంలోని సరిహద్దుల్లో పడడంతో ఇద్దరు మృతి చెందారు. ఇది రష్యా నుంచి వచ్చిన క్షిపణి అని మొదట వార్తలు వచ్చాయి. అయితే ఉక్రెయిన్ ప్రయోగించిందిన కూడా అంటున్నారు.

ఉక్రెయిన్ సరిహద్దుకు 6 కి.మీల దూరంలో పోలండ్ లోని ఓ గ్రామంలోకి క్షిపణి దూసుకు వచ్చిందని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. ఇది రష్యాలో తయారైన క్షిపణి అని తెలిపింది. దీనిపై వివరణ ఇవ్వాలని రష్యా రాయబారికి సమన్లు అందజేసింది. అయితే దీన్ని రష్యా ఖండించింది. ఇది ఉక్రెయిన్ క్షిపణి అని.. ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించింది.

ప్రస్తుతం అమెరికా, ఐరోపా దేశాలు సహా పలు దేశాలు జీ-20 సదస్సులో ఇండోనేషియా దేశంలో సమావేశమవుతున్నాయి. నాటో దేశమైన పోలండ్ పై క్షిపణి దాడితో అమెరికా అధ్యక్షతన జీ20 నాటోదేశాలన్నీ అత్యవసరంగా సమావేశమయ్యాయి. ఈ పేలుడుపై దర్యాప్తు జరుగుతున్నట్లు అధ్యక్షుడు జోబైడెన్ తెలిపారు. రష్యా నుంచి ప్రయోగించిన క్షిపణి వల్ల ఈ ఘటన చోటుచేసుకొని ఉండకపోవచ్చని జోబైడెన్ తెలిపారు. ప్రస్తుతం పోలండ్ మిలటరీని హై అలెర్ట్ లో ఉంచారు.

ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం రష్యా క్షిపణులే పోలండ్ లోకి దూసుకెళ్లాయని.. మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఒక నాటోదేశంపై రష్యా క్షిపణి పేలడం అనేది యూరప్ పై దాడి అని అందరూ స్పందించాలని ఉసిగొల్పారు.

ఇక ఉక్రెయిన్ నుంచి ఈ క్షిపణి వచ్చిందన్న తాజా నివేదికలపై ఆ దేశ విదేశాంగ మంత్రి స్పందించారు. ఇది కుట్ర సిద్ధాంతం అంటూ కొట్టిపారేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News