పాకిస్థాన్ పైకి బ్రహ్మాస్త్రం?

Update: 2022-03-12 04:30 GMT
హఠాత్తుగా జరిగిన ఓ ప్రమాదంలో మనదేశం దగ్గున్న అస్త్రాల్లో ఒకటైన  బ్రహ్మాస్త్రం పాకిస్తాన్ పైకి దూసుకెళ్ళింది. దాంతో పాకిస్ధాన్ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే హర్యానాలోని సిర్సా నుంచి ప్రయోగించిన మిస్సైల్ దారితప్పి పాకిస్థాన్ లోకి వెళ్ళిపోయింది. మూడు నిముషాల పాటు దాయాది గగనతలంలో ప్రయాణించి పంజాబ్ ప్రావిన్స్ లోని ముయున్ చన్ను అనే ప్రాంతంలో కూలిపోయింది.

 ఈ మిస్సైల్ సృష్టించిన విధ్వంసం దెబ్బకు ప్రాణనష్టం జరగకపోయినా భారీగా ఆస్తుల నష్టం మాత్రం జరిగింది. మిస్సైల్ సృష్టించిన విధ్వంసంతో పాకిస్థాన్ ఆర్మీ ఉన్నతాధికారులు వెంటనే అలర్టయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని ఏమి జరిగుంటుందనే విషయమై ఆరాలు తీశారు.

తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి పాకిస్తాన్ లోని భారత రాయబారిని పిలిపించుకుని ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

 మన దేశానికి చిందిన ఒక మిస్సైల్ ఒకటి ప్రమాదవశాత్తు పాకిస్తాన్ భూభాగంలోకి దూసుకెళ్ళినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు ధృవీకరించారు. అయితే ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిన యాక్సిడెంటల్ ఫైరింగ్ అని చెప్పారు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం భారత్ భూభాగంలో నుంచి పాకిస్థాన్ లోకి దూసుకెళ్ళింది ఆయుధ రహిత సూపర్ సోనిక్  మిస్సైల్ బ్రహ్మోస్ అట.

హర్యానాలోని సిర్సాలో ప్రయోగించిన ఈ మిస్సైల్ రాజస్ధాన్ లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేజ్ లోకి వెళ్ళాలి. అయితే ప్రయోగించిన వెంటనే సాంకేతిక లోపం కారణంగా రాజస్ధాన్ వైపు వెళ్ళాల్సిన మిస్సైల్ తనంతటా అదే దారి మార్చుకుని పాకిస్ధాన్ లోకి వెళ్ళిపోయింది.

12 కిలోమీటర్ల ఎత్తులో మూడున్నర నిముషాల చక్కర్లు కొట్టి చివరకు కూలిపోయింది. దీనిపై రెండు దేశాల్లో ఆర్మీ అధికారులు విచారణ చేస్తున్నారు. చివరకు ఏమి తేలుతుందో చూడాలి.
Tags:    

Similar News