రేసిజానికి కొత్త అర్థాన్ని చెప్పింది.. ప్రముఖ డిక్షనరీ ఓకే చెప్పింది

Update: 2020-06-12 23:30 GMT
రేసిజానికి కొత్త అర్థాన్ని చెప్పిందో యువతి. ఇప్పటివరకూ ప్రముఖ డిక్షనరీలో చెప్పిన దానికి బదులు.. ఆమె ప్రతిపాదించిన కొత్త అర్థాన్ని ఓకే చేస్తూ ప్రముఖ డిక్షనరీ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ఆమె ఎవరు? ఆమేం చేసిందన్న విషయంలోకి వెళితే.. కెన్నెడీ మిచమ్.. చాలామంది నల్లజాతి అమ్మాయిల్లో ఒకరు. పుట్టినప్పటి నుంచి ఆమె చర్మం నల్లగా ఉండటంతో తెల్లోళ్ల మధ్య నల్లకలువ లాంటి పరిస్థితి. తల్లిఒడి నుంచి బయట ప్రపంచానికి వచ్చినప్పటి నుంచి ఆమె అనునిత్యం రేసిజం బారిన పడేది. స్కూలు.. కాలేజీ.. వర్సిటీ.. ఇలా వెళ్లిన ప్రతిచోటా ఆమె వివక్ష ఎదుర్కొనేది. దాదాపు ఆరేళ్ల క్రితం తొలిసారి రేసిజం అంటే ఏమిటన్న ప్రశ్న వచ్చింది. అది కూడా పద్దెనిమిదేళ్ల మైఖేల్ బ్రైన్ అనే నల్లజాతి యువకుడ్ని ఒక పోలీసు అధికారి కాల్చి చంపినప్పుడు చోటు చేసుకున్నఆందోళనతో ఆమెకు కొత్త సందేహాలు కలిగాయి.

బ్లాక్ లైవ్స్ మేటర్ పేరుతో మొదలైన ఉద్యమం ఆమె మీద ప్రభావాన్ని చూపింది. అప్పటికి ఆమె వయసు పదహారేళ్లు. రేసిజం అనే మాటకు సరైన అర్థాన్ని తెలుసుకునేందుకు అమెరికాలో అత్యధికంగా అమ్మే 150 ఏళ్ల చరిత్ర ఉన్న మెరియం వెబ్ స్టర్ డిక్షనరీలో వెదికింది. పుట్టిన జాతి నుంచి సంక్రమించే అధిక్య భావన అని ఉంది. ఆ అర్థం సరికాదనిపించింది. అదే విషయాన్ని ప్రొఫెసర్లను అడిగితే వారిచ్చిన సమాధానంతో కన్వీన్స్ కాలేదు. సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని చర్చకు పెట్టింది. బోలెడన్ని విమర్శలు వినిపించాయి. అదే వేళలో.. కొందరి నుంచి మద్దతు లభించింది.

నెలల తరబడి మదనం తర్వాత.. సదరు డిక్షనరీ పబ్లిషర్స్ కు ఒక మొయిల్ పంపింది. రేసిజం మీద డిక్షనరీలో ఉన్న అర్థాన్ని మార్చాల్సిన అవసరం ఉందని.. అది తప్పు.. అని తాను అనుకున్న అర్థాన్ని రాసి పంపింది. కట్ చేస్తే.. వెబ్ స్టర్ ఎడిటర్ నుంచి ఆమెకో మొయిల్ వచ్చింది. ఆగస్టులో మార్కెట్లోకి వచ్చే డిక్షనరీలో రేసిజానికి మా పాత అర్థాన్ని తొలగించి.. మీరు ప్రతిపాదించిన అర్థాన్ని చేరుస్తున్నామని పేర్కొన్నారు. ఆమె ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఇంతకీ ఆమె చెప్పిన అర్థం ఏమిటంటే.. ‘‘అల్పులనే భావన’’.  ఆమె వాదన ఏమంటే.. అల్పులనే భావన లేకుంటే అధిక్యులనే భావన ఎందుకు వస్తుందని. నిజమే.. ఆమె వాదనలోనూ లాజిక్ ఉంది. అందుకే అంత పెద్ద సంస్థ ఆమె ప్రతిపాదనను ఓకే చేసింది.
Tags:    

Similar News