మిస్త్రీ ప్రయాణించిన కారుకు 7 ఎయిర్ బ్యాగ్స్.. అయినా ప్రాణం పోయిందెందుకు?

Update: 2022-09-06 04:45 GMT
నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందుకు భిన్నంగా కొన్ని ప్రమాదాలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త.. కొన్నాళ్ల క్రితం టాటా సంస్థకు నాయకత్వం వహించిన సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు అమితమైన వేగంతో ఉండటం.. అదుపు తప్పి.. డివైడర్ ను బలంగా ఢీ కొనటం.. వెనుక కూర్చున్న ఆయన ప్రమాదం బారిన పడి.. అక్కడికక్కడే మరణించటం తెలిసిందే.

వెనుక సీట్లో కూర్చున్నా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం మిస్త్రీ మరణం అనివార్యమైందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. అత్యంత వేగంగా కారు వెళుతున్న వేళ.. అనూహ్యంగా అదుపు తప్పి వేగంగా డివైడర్ ను ఢీ కొనటంతో సైరస్ మిస్త్రీ మరణ వార్తను వినాల్సిన పరిస్థితి. అయితే.. ఈ ప్రమాదంలో ఆయన ప్రాణాలు పోవటానికి ప్రధాన కారణం ఆయన సీటు బెల్ట్ పెట్టుకోకపోవటంగా చెబుతున్నారు.

అదే సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారుకు '7' ఎయిర్ బ్యాగ్స్ ఉన్న విషయం బయటకు వచ్చింది. మరి.. ఇన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నప్పటికీ.. ప్రాణాలు ఎందుకు పోయాయి? అన్నదిప్పుడు మెదులుతున్న మరో ప్రశ్న. దాదాపుగా లగ్జరీ కార్లలో ఉండే ఒక ఫీచర్ మిస్త్రీ ప్రయాణిస్తున్న కారుకు లేకపోవటమే ఆయన ప్రాణాలు కోల్పోయేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.
మిస్త్రీ ప్రయాణించిన కారు మెర్సిడెజ్ బెంజ్. జీఎల్ సీ 220డి 4ఎంఏటిక్.. 2017లో విడుదలైన కారు. ఇందులో ఏడు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. కారులో ముందు కూర్చున్న వారితో పాటు వెనుక భాగంలో కూర్చున్న వారికి ప్రమాద సమయంలో ఓపెన్ అయ్యేందుకు వీలుగా ఎయిర్ బెలూన్లు ఉన్నాయి. అయితే.. వెనుక కూర్చున్న వారి ముందు ఎయిర్ బాగ్స్ లేకపోవటం ఈ మొత్తంలో పెద్ద లోపంగా చెప్పాలి.

సాధారణంగా అన్ని లగ్జరీ కార్లలోనూ వెనుక కూర్చున్న ప్రయాణికులకు ఏం కాకుండా ఉండేందుకు వారి ముందు కూడా ఎయిర్ బాగ్స్ ఓపెన్ అయ్యే  సదుపాయం ఉంటుంది. అయితే.. ఈ కారులో ఆ సదుపాయం లేదు. ఇక.. ప్రమాదానికి గురైన కారు మోడల్ ప్రస్తుతం విలువ రూ.68 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. ఈ మోడల్ కారులోనూ భద్రతకు సంబందించిన పలు ఫీచర్లు ఉన్నప్పటికీ అవేమీ వర్కువుట్ కాలేదు.

కారులోని ఈ లోపం కూడా ప్రాణాలు పోవటానికి కారణమైందన్న మాట వినిపిస్తోంది. ఇక.. కారును అమితమైన వేగంతో నడిపినట్లుగా చెబుతున్నారు. రోడ్డును అంచనా వేయటంలో ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. ఈ ప్రమాదానికి కాస్త ముందు మహారాష్ట్ర లోని ఒక చెక్ పోస్టును ఆదివారం మధ్యాహ్నం మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు అత్యంత వేగంగా ప్రయాణించిందన్న మాటను ప్రస్తావిస్తున్నారు.

అక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 9 నిమిషాల్లోనే చేరుకుందంటే.. ఆ కారు ఎంత వేగంగా వెళుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కారును నడుపుతున్న డాక్టర్ అనహిత కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది. స్వభావ రీత్యా డాక్టర్ అయిన అనహితాకు తాజా ప్రమాదంలో గాయాలు కావటం తెలిసిందే. ఆమె పక్కనే ప్రయాణిస్తున్న ఆమె భర్తకు కూడా గాయాలు అయ్యాయి. ఇక.. వెనుక కూర్చున్న ఇద్దరి ప్రాణాలు పోయాయి. ఒకవేళ.. ఈ కారులో కానీ.. వెనుక కూర్చున్న వారి ముందు ఎయిర్ బాగ్స్ విడుదలయ్యే వీలు ఉండి ఉంటే.. మిస్త్రీకి  ప్రాణాపాయం తప్పేదేమో?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News