మిథాలీపై వేటు.. పర్సనల్ గొడవతోనేనా?

Update: 2018-11-25 07:53 GMT
భారత క్రికెట్ అభిమానుల చర్చలు ఎప్పుడూ పురుషుల జట్టు చుట్టూనే తిరుగుతుండేవి ఒకప్పుడు. కానీ గత ఏడాది మహిళల వన్డే ప్రపంచకప్ దగ్గర్నుంచి పరిస్థితి మారింది. అమ్మాయిలు సైతం బాగానే అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రియుల మనసులు గెలిచారు మన అమ్మాయిలు. అప్పట్నుంచి వాళ్ల ఆటకు ఆదరణ పెరిగింది. తాజాగా టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్తే అందరూ వాళ్లకు మద్దతుగా నిలిచారు. సెమీస్ మ్యాచ్‌ను కూడా ఆసక్తిగా తిలకించారు. కానీ సెమీఫైనల్లో చెత్తగా ఆడి పరాజయం పాలైంది భారత్. ఐతే ఆటలో గెలుపోటములు మామూలే కాబట్టి ఈ ఓటమిని లైట్ తీసుకోవచ్చు. కానీ ఈ ఓటమికి కేవలం ఆట మాత్రమే కారణంగా భావించడం లేదు.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ - కోచ్ రమేష్ పొవార్ కలిసి దురుద్దేశాలతో తీసుకున్న ఓ నిర్ణయమే ఈ ఓటమికి కారణం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫామ్‌లో ఉన్న మిథాలీని వేగంగా ఆడలేదన్న కారణం చూపించి ఈ మ్యాచ్‌కు పక్కన పెట్టేశారు. నిజానికి మిథాలీ ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. ఈ ప్రపంచకప్‌లో బ్యాటింగ్ చేసిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆమె అర్ధశతకాలు సాధించింది. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాపై 60 బంతుల్లోనే సెంచరీ చేసిందామె. అలాంటి క్రీడాకారిణిని సెమీస్‌కు పక్కన పెట్టడమేంటో అర్థం కావడం లేదు. మరి వేగంగా ఆడతారని పేరున్న వేద కృష్ణమూర్తి.. తానియా భాటియా.. ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన చేశారు. సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం అయ్యారు. మరి ఏ ఉద్దేశంతో మిథాలీని పక్కన పెట్టినట్లు?

గత ఏడాది ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై మెరుపు ఇన్నింగ్స్‌తో హర్మన్‌ప్రీత్ పేరు మహిళల క్రికెట్లో మార్మోగింది. ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చింది ఇండియాలో. మహిళల క్రికెట్లో సూపర్ స్టార్ అయింది హర్మన్. ఐతే ఈ ఆదరణ ఆమెలో అహంకారం తెచ్చిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. జట్టులో తనను మించిన క్రికెటర్ లేదని విర్రవీగడం మొదలుపెట్టిందని.. ఈ క్రమంలో సీనియర్ల పట్ల సరిగా వ్యవహరించలేదని గుసగుసలు వినిపించాయి. మహిళల క్రికెట్లో విదేశీయులు సైతం ఎంతగానో గౌరవించే క్రీడాకారిణి మిథాలీ. ఆమె ఘనతల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇటు వన్డేల్లో.. అటు టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డు ఆమెదే. దేశంలో మహిళల క్రికెట్‌కు ఏమాత్రం ఆదరణ లేనపుడు.. సరిగా మ్యాచ్‌ ఫీజులు కూడా రాని రోజుల్లో ఎన్నో కష్టాలు పడి ఆటలో కొనసాగిందామె. ఇప్పుడు 35 ఏళ్ల వయసులో కూడా ఫిట్నెస్ కాపాడుకుంటూ మంచి ఫాంలో ఉన్న మిథాలీని తప్పించడం అంటే వ్యక్తిగత వ్యవహారాలే కారణం అని తెలుస్తోంది. మిథాలీని జట్టు నుంచే సాగనంపాలన్న ఆలోచనతో హర్మన్ ఉందని.. ఆ ఉద్దేశంతోనే ఆమెను పక్కన పెట్టిందని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి మిథాలీపై వేటు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. మహిళల ఆటలోనూ రాజకీయాలు తక్కువ కాదని ఈ ఉదంతం రుజువు చేసింది. మున్ముందు ఈ గొడవ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.
Tags:    

Similar News