ఇప్పుడు నిప్పు ఎలా అవుతావు బాబు?

Update: 2017-04-04 10:19 GMT
ఏపీ మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో భాగంగా త‌మ పార్టీ ద్వారా గెలిచిన వారికి మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంపై వైసీపీ ర‌గిలిపోతోంది. తెలంగాణ‌లో ఇలాంటి ప‌రిణామం జ‌రిగితే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఏపీ సీఎం, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర బాబు ఇప్పుడు చేసింది ఏమిట‌ని వైసీపీ ప్ర‌శ్నిస్తోంది. ఈ క్ర‌మంలో బాబును టార్గెట్ చేసుకొని ఘాటు విమ‌ర్శ‌లు చేస్తోంది. తాజాగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి సూటి ప్ర‌శ్న‌లు సంధించారు. తన కుమారుడు లోకేష్‌ ని మంత్రిని చేయడం కోసమే మంత్రివర్గ విస్తరణ అంటూ చంద్రబాబు నాటకాలు ఆడారని విమర్శించారు. ఇందులోనూ వైఎస్ఆర్‌సీసీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను కేబినెట్‌ లోకి తీసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు.

అవినీతి, అక్రమాలు, దోపిడీకి టీడీపీ ప్రభుత్వం కేంద్రబిందువుగా మారిందని జాతీయ స్థాయి నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం పేరిట కోట్ల రూపాయలు దండుకుంటూ ఆ సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశార‌ని ఆరోపించారు. తాను నిజాయితీ పరుడినని, నిప్పునని పదే పదే ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేల పిరాయింపు, మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంపై ఏం స‌మాధానం ఇస్తార‌ని మిథున్ రెడ్డి ప్ర‌శ్నించారు. దేశ రాజకీయాల్లో సీనియర్‌ని అని గొప్పలు చెప్పుకొనే చంద్రబాబు ఇలాంటి రాజ‌కీయాల్లోనే సీనియ‌ర్ అవుతారా అని ఎద్దేవా చేశారు.

కాగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సామాజిక న్యాయం జ‌ర‌గ‌లేద‌ని మిథున్ రెడ్డి మండిప‌డ్డారు. మారు 16 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలు, ఎస్టీలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించకపోవడంపై చంద్ర‌బాబు స‌మాధానం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాలకు ప‌రిపాల‌న‌లో చోటు ద‌క్క‌న‌ప్పుడు అది సంక్షేమ పాల‌న ఎలా అవుతుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. స్వార్థం, అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే గుణపాఠం చెబుతారని మిథున్ రెడ్డి హెచ్చరించారు. టీడీపీ ప‌రిపాల‌న‌తో విసుగు చెందిన ప్ర‌జ‌లు ఎన్నిక‌లు ఎప్పుడు వ‌చ్చినా వైసీపీకి ప‌ట్టం క‌ట్టి సుప‌రిపాల‌న‌కు బాట‌లు వేసేందుకు సిద్ధంగా ఉన్నార‌ని మిథున్ రెడ్డి తెలిపారు.​

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News