ఏదైనా రాష్ట్రానికి వీఐపీలు వస్తున్నారంటే.. ఆనందంగా ఆహ్వానిస్తుంటాం. ఒకవేళ పండగలు.. పర్వదినాల సమయంలో వస్తే వారికి మరింత సంతోషంగా స్వాగతం చెప్పటం కామన్. కానీ.. అందుకు భిన్నమైన ప్రకటన చేసింది మిజోరం ప్రభుత్వం. మిజోరం రాష్ట్రంలో క్రిస్మస్.. న్యూఇయర్ వేడుకల్ని భారీగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తుంటారు. ఇంత భారీగా జరిగే వేడుకల నేపథ్యంలో ప్రజలంతా బిజీగా ఉండటం.. ప్రభుత్వ యంత్రాగం సెలవుల్లో ఉండే నేపథ్యంలో.. తమ రాష్ట్రానికి వీఐపీలు ఎవరిని రావొద్దని చెబుతోంది మిజోరం ప్రభుత్వం. ఈ విషయాన్న అధికారికంగా ప్రకటించింది కూడా. తమకు పర్వదినాలైన క్రిస్మస్.. న్యూఇయర్ సమయంలో తమ రాష్ట్రానికి వచ్చే అతిధులకు అతిధ్యం కల్పించలేమని.. అందుకే.. డిసెంబరు 14 నుంచి జనవరి 8 వరకు తమ రాష్ట్రానికి రావొద్దంటూ వీఐపీలకు స్పష్టం చేసింది మిజోరం రాష్ట్రం.