అమ‌రావతి ఉద్య‌మంపై ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్య‌లు..!

Update: 2021-07-03 13:07 GMT
మూడు రాజ‌ధానుల‌ను వ్య‌తిరేకిస్తూ.. అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని ఉండాలంటూ.. అక్క‌డి రైతులు ఏడాదికిపైగా ఆందోళ‌న కొన‌సాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళ‌న‌పై తాటికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఉద‌యం మంద‌డంలో నిర్మించిన నూత‌న స‌చివాల‌యం ప్రారంభోత్స‌వానికి వెళ్తున్న ఎమ్మెల్యేల‌ను.. అమ‌రావ‌తి ప్రాంత రైతులు అడ్డుకున్నారు.

గుంటూరు జిల్లాలోని మంద‌డంలో గ్రామ స‌చివాల‌యం ప్రారంభించేందుకు లింగాయ‌పాలెం మీదుగా బ‌య‌లుదేరారు ఎమ్మెల్యే. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ జేఏసీ నేత‌లు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. అసైన్డ్ భూముల రైతుల‌కు ప్రభుత్వం కౌలు డ‌బ్బులు ఇవ్వ‌ట్లేద‌ని, పింఛ‌న్లు కూడా చెల్లించ‌ట్లేద‌ని ఆందోళ‌న‌కు దిగారు.

ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి వాహ‌నానికి అడ్డుగా రోడ్డుపై బైఠాయించారు. ప‌లువురు ద‌ళిత మ‌హిళా రైతులు ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని, ఎమ్మెల్యే వెళ్లిపోయిన త‌ర్వాత వ‌దిలిపెట్టారు. మంద‌డం గ్రామ స‌చివాల‌యం భ‌వ‌న ప్రారంభోత్స‌వం చేసిన వైసీపీ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. త‌న వాహ‌నాన్ని అడ్డుకోవ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.

త‌మ స‌మ‌స్య‌ల‌పై రైతులు ఎవ‌రూ త‌న‌ను ఇంత వ‌ర‌కూ క‌ల‌వ‌లేద‌ని చెప్పారు. నిజంగా రైతుల‌కు స‌మ‌స్య ఉంటే.. వారు క‌లిస్తే.. త‌ప్ప‌కుండా స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషిచేస్తాన‌ని అన్నారు. స‌మ‌స్య త‌న దృష్టికి తేకుండా.. రోడ్ల‌పై విన‌తి ప‌త్రాలు ఇస్తామంటేఎలా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమ‌రావ‌తిలో జ‌రుగుతున్న‌ది నిజ‌మైన ఉద్యమం కాద‌ని.. అది కేవ‌లం ఫొటో ఉద్య‌మం అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. అమ‌రావ‌తి ప్రాంతం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సార‌ధ్యంలోనే అభివృద్ధి చెందుతుంద‌ని అన్నారు.

అటు అమ‌రావ‌తి రైతులు మాత్రం.. ఎమ్మెల్యే త‌మ విన‌తి ప‌త్రాన్ని తీసుకోలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్న త‌మ‌ను పోలీసులు అరెస్టు చేశార‌ని మండిప‌డ్డారు. కాగా.. ఎమ్మెల్యేను అడ్డుకున్న‌వారు ద‌ళిత మ‌హిళలే కావ‌డం గ‌మ‌నార్హం. కొంద‌రు పురుషులు కూడా ద‌ళితులే ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి ద‌ళిత వ‌ర్గానికి చెందిన‌వారు కావ‌డంతో.. ఉద్దేశ‌పూర్వ‌కంగానే టీడీపీ నేత‌లు ద‌ళితుల‌ను రెచ్చ‌గొట్టి పంపించార‌ని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News