తండ్రి కబ్జా చేసిన స్థలం మున్సిపాలిటీకి...!

Update: 2023-06-25 15:08 GMT
సాధారణంగా సినిమాల్లో జరిగే ఒక సంఘటన తాజాగా తెలంగాణలో జరిగింది. తన తండ్రి భూమిని కబ్జా చేశారని.. పైగా అది తనపేరున అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని.. ఇప్పుడు ఆ స్థలాన్ని తాను తిరిగి ప్రభుత్వానికి అప్పగించేస్తున్నానని ఆయన కూతురు చెప్పిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివారాళ్లోకి వెళ్తే... సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలాన్ని తన తండ్రి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డి ఆరోపించారు. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా... ఆ 1200 గజాల భూమి చుట్టూ ఉన్న ప్రహరీని ఆమె తొలగించారు. దీనికి సంబంధించిన ఓ నోటీసు బోర్డును కూడా ఆమె ఏర్పాటు చేశారు.

అయితే ఈ విషయాలపై స్పందించిన భవానీ రెడ్డి... జరిగిన తప్పుకు జనగామ ప్రజలను క్షమించమని అడుగుతున్నానని తెలిపారు. అనంతరం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 70ఏళ్ల వయసున్న తనతండ్రి ఈ పని చేసి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యే కాకముందే వెయ్యి కోట్ల ఆస్తి ఉందని చెప్పే ఆయన... ఇలాంటి పనులు చేయటం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ఈ భూమిని తిరిగి అప్పగించడానికి సంబంధించిన పేపర్ వర్క్ అంతా పూర్తయ్యిందని తెలిపిన భవానీ రెడ్డి... ఫ్యూచర్ లో ఎలాంటి లీగల్ ఇబ్బందులూ ఈ భూమికి రాకుండా కోర్టుద్వారా కలెక్టర్ కు ఈ భూమిపత్రాలు అందజేస్తానని తెలిపారు.

కాగా... జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన కుమార్తె మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల... తన సంతకాన్ని ఫోర్జరీ చేశావంటూ తండ్రి ముత్తిరెడ్డిని నలుగురిలో నిలదీశిన భవానీ... "ఇప్పటికే ఓ కేసు పెట్టాను, ఇంకో కేసు కూడా పెడుతున్నాను" అంటూ ముత్తిరెడ్డిని సూటిగా హెచ్చరించారు.

తనకు ఇష్టం లేకపోయినా చేర్యాలలో భూమి కబ్జాచేశారని, ఆ డాక్యుమెంట్లలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తుల్జా భవానీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా... తన తండ్రి భూ వివాదంలో తనను ఇరికించారని భవాని రెడ్డి ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి ముందే ఈమె ఇలా ఫైరవ్వడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఈ విషయాలపై స్పందించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి... తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తన మనోస్థైర్యం దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెకు తన సొంత ఆస్తి ఇస్తే మోసం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. 

Similar News