హుజూరాబాద్‌ లో ఆ నేత తొంద‌ర‌ ప‌డ్డారా..!

Update: 2021-12-17 03:16 GMT
మాజీ మంత్రి, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఇనుగాల‌ పెద్దిరెడ్డి తొంద‌ర‌ప‌డ్డారా..? బీజేపీని వీడి త‌ప్పు చేశాన‌ని భావిస్తున్నారా..? అంటే అవున‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆయ‌న అభిమానులు ఈవిష‌యంపై ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. టీఆర్ఎస్ లో త‌మ నేత భ‌విష్య‌త్ ఎలా ఉంటుందోన‌నే గుబులు నెల‌కొంద‌ట‌. దేవేంద‌ర్‌గౌడ్ తో వెళ్లి మొద‌టి త‌ప్పు చేస్తే.. ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరి రెండో త‌ప్పు చేశార‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతోంది.

ఇనుగాల పెద్దిరెడ్డి ఇటీవ‌ల బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. త‌న ప్ర‌త్య‌ర్థి టీఆర్ఎస్ మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ బీజేపీలో చేర‌డంతో నొచ్చుకున్న పెద్దిరెడ్డి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ లేదా రాజ్య‌స‌భ హామీతోనే పార్టీలో చేరిన‌ట్లు తెలుస్తోంది.

అయితే.. ఇక్క‌డే అస‌లైన ట్విస్టు నెల‌కొంది. త‌న‌తో పాటే టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి, ఎల్ ర‌మ‌ణ‌కు అదృష్టం ప‌ట్టుకుంది. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వీరిద్ద‌రికీ స‌ముచితం స్థానం ద‌క్కింది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి చివ‌రి నిమిషంలో కారెక్కిన కౌశిక్ రెడ్డికి.. తెలంగాణ టీడీపీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను వ‌దిలేసి వ‌చ్చిన ర‌మ‌ణ‌కు పార్టీ అధినేత కేసీఆర్ మంచి బ‌హుమ‌తి ఇచ్చారు. కానీ అదే బీజేపీ నుంచి వ‌చ్చిన పెద్దిరెడ్డిని ప‌ట్టించుకోలేదు. దీనిపై పెద్దిరెడ్డి వ‌ర్గీయులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ట‌.

ఈ అంశంపై పెద్దిరెడ్డి కూడా ఆవేద‌న చెందుతున్నార‌ట‌. త‌న స‌మ‌కాలీనుల‌కు.. త‌న జూనియ‌ర్ ను అంద‌లం ఎక్కించార‌ని.. క‌నీసం త‌న‌ను సంప్ర‌దించ‌లేద‌ని బాధ‌ప‌డుతున్నార‌ట‌. బీజేపీని వీడి త‌ప్పు చేశానా అనే భావ‌న‌లో ఉన్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ తిరిగి అధికారంలోకి వ‌చ్చే ప‌రిస్థితి క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో బీజేపీలో ఉన్నా ఏదో ఒక ప‌ద‌వి వ‌చ్చేద‌నే ఆలోచ‌న‌లో ప‌డిపోయార‌ట‌. బీజేపీలోనే ఉంటే హుజూరాబాద్ అసెంబ్లీ లేదా క‌రీంన‌గ‌ర్ ఎంపీ స్థానాల్లో పోటీకి అవ‌కాశం ఉండేద‌ని.. ఇప్పుడూ ఎటూ కాకుండా పోయాన‌నే బాధ‌ను త‌న అనుచ‌రుల వ‌ద్ద పంచుకుంటున్నార‌ట‌.

ఇనుగాల పెద్దిరెడ్డి 1994, 99 ఎన్నిక‌ల్లో హుజూరాబాద్ నుంచి వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు టీడీపీ త‌ర‌పున విజ‌యం సాధించారు. చంద్ర‌బాబు కేబినెట్‌లో కార్మిక మంత్రిగా కూడా ప‌నిచేశారు. ప‌లు యూనియ‌న్ల‌కు అధ్య‌క్షుడిగా కూడా వ్య‌వ‌హ‌రించారు. వైఎస్‌, కేసీఆర్ హ‌యాంలో క‌నుమ‌రుగు కావ‌డంతో కొన్నేళ్ల క్రితం బీజేపీలో చేరారు. ఈటెల రాక‌తో బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.

ఇప్పుడు టీఆర్ఎస్ లో కూడా స‌రైన గుర్తింపు లేక‌పోవ‌డంతో మౌనంగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇందులోనే ఉంటారా.. ఇత‌ర ప్ర‌త్యామ్నాయం వెతుక్కుంటారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా పార్టీ మారి త‌మ నేత రెంటికి చెడ్డ రేవ‌డిలా త‌యార‌య్యార‌ని అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.




Tags:    

Similar News